కాగితపు పులిలా ఐరాస!.. షోలే మీమ్‌తో ఇరాన్‌ పంచ్‌! | Iranian Embassy Shares Sholay Meme Mocking UNs Powerlessness | Sakshi
Sakshi News home page

కాగితపు పులిలా ఐరాస!.. షోలే మీమ్‌తో ఇరాన్‌ పంచ్‌!

Sep 30 2026 9:19 AM | Updated on Sep 30 2026 9:19 AM

Iranian Embassy Shares Sholay Meme Mocking UNs Powerlessness

భారతీయ సినిమాలతో ఇరాన్‌ చేస్తున్న ‘మీమ్‌ డిప్లమసీ’ ఇప్పుడు మరో లెవల్‌కు చేరింది. మొన్న బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’.. నిన్న ప్రభాస్‌ ‘బాహుబలి’.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ క్లాసిక్‌ ‘షోలే’లోని థాకూర్‌ బల్దేవ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈసారి ఇరాన్‌ టార్గెట్‌ అమెరికా కాదు.. ఐక్యరాజ్యసమితి (ఐరాస). యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ఐరాస సమర్థంగా డీల్‌ చేయలేకపోతోందంటూ తన అభిప్రాయాన్ని ఓ వ్యంగ్య మీమ్‌ ద్వారా చెప్పింది. 

భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఓ మీమ్‌ను పోస్టు చేసింది. అందులో రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టింది. మొదటి ఫొటోలో మార్వెల్‌ సూపర్‌హీరో డాక్టర్‌ స్ట్రేంజ్‌ను పలు చేతులతో చూపించింది. దానిపై స్కూల్‌ పుస్తకాల ప్రకారం ఐక్యరాజ్య సమితి అని రాసింది. అంటే పుస్తకాల్లో ఐరాసకు ప్రపంచ సమస్యలను పరిష్కరించేంత శక్తి, అనేక మార్గాల్లో పనిచేసే సామర్థ్యం ఉన్నట్లు చూపిస్తున్నారనే కోణం. అదే పక్కన ‘షోలే’లోని థాకూర్‌ బల్దేవ్‌ సింగ్‌ ఫొటోను పెట్టింది. 

షోలే చిత్రంలో గబ్బర్‌ చేతిలో చేతులు కోల్పోయిన థాకూర్‌ పాత్ర కింద యూఎన్‌ ఇన్‌ రియాలిటీ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అంటే వాస్తవ పరిస్థితుల్లో పెద్ద అంతర్జాతీయ సంక్షోభాలపై చర్య తీసుకునే విషయంలో ఐరాస ‘చేతులు కట్టేసిన’ సంస్థలా ఉందన్నది ఇరాన్‌ వ్యంగ్య సందేశం. 

ఆరాఘ్చీ విమర్శల వేళ..
ఈ మీమ్‌ రావడానికి ముందు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ ఆరాఘ్చీ ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో సమావేశమయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్‌ చర్యలపై ఐరాస తగినంతగా స్పందించడం లేదని అరాఘ్చీ విమర్శించినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. యూఎన్‌ చార్టర్‌, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల విషయంలో ప్రపంచ సంస్థ మౌనం వహించకూడదని, అమెరికా నుంచి వస్తున్నాయని ఇరాన్‌ పేర్కొంటున్న బెదిరింపులను ఐరాస స్పష్టంగా ఖండించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే తాజా మీమ్‌లో ఇరాన్‌ ఏదైనా నిర్దిష్ట ఐరాస తీర్మానం లేదంటే ఒక్క ఘటనను నేరుగా ప్రస్తావించలేదు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ఐరాసకు ఉన్న అధికారిక పాత్రకు, ఆచరణలో అది చూపగల ప్రభావానికి మధ్య వ్యత్యాసం ఉందన్న తన విమర్శను మాత్రమే మీమ్‌ రూపంలో వ్యక్తం చేసింది. 

భారతీయ సినిమాలే ఎందుకు?
ఇరాన్‌ దౌత్య కార్యాలయాలు భారతీయ సినిమాలను తమ డిజిటల్‌ ప్రచారంలో ఉపయోగించడం ఇటీవల వరుసగా కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 27న హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఐరాస ప్రసంగంలో ‘తలవంచబోం’ అన్న సందేశాన్ని బాహుబలి పోరాటంతో పోల్చింది. అంతకుముందు బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ సన్నివేశాన్ని.. ట్రంప్‌పై సెటైరిక్‌గా ఇరాన్‌ దౌత్య వర్గాలు ఉపయోగించాయి. ఇప్పుడు ‘షోలే’లోని థాకూర్‌ పాత్రతో ఐరాసపై సెటైర్‌ చేయడం ద్వారా భారతీయ పాప్‌ కల్చర్‌ను మరోసారి తన అంతర్జాతీయ సందేశానికి వాడుకుంది.

మీమ్‌ డిప్లమసీకి కొత్త రూపం
సాధారణంగా దేశాలు అంతర్జాతీయ వివాదాలపై ప్రకటనలు, ప్రెస్‌నోట్లు, అధికారిక ప్రసంగాల ద్వారా తమ వైఖరిని వెల్లడిస్తాయి. ఇరాన్‌ మాత్రం సోషల్‌ మీడియాలో మీమ్స్‌, సినిమాల సన్నివేశాలు, వ్యంగ్య వీడియోలను ఉపయోగిస్తూ తన సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తోంది. ఇటువంటి పోస్టులు క్లిష్టమైన భౌగోళిక రాజకీయ అంశాలను సులభమైన, వెంటనే అర్థమయ్యే విజువల్స్‌గా మార్చుతున్నాయి. 

ఇదీ చదవండి: ట్రంప్‌ సంచలన నిర్ణయంతో కొత్త చర్చ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement