కరాచీ టీంను బికారీలుగా మార్చిన బలూచ్‌లు! | Karachi Football Team Robbed at Gunpoint on Balochistan Highway | Sakshi
Sakshi News home page

కరాచీ టీంను బికారీలుగా మార్చిన బలూచ్‌లు!

Sep 30 2026 8:02 AM | Updated on Sep 30 2026 8:20 AM

Karachi Football Team Robbed at Gunpoint on Balochistan Highway

మార్గమధ్యలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ముందే హెచ్చరించారు. కానీ అత్యుత్సాహంతో ఆ సూచనను పట్టించుకోలేదు. తీరా హైవేపైకి చేరుకున్నాక ఊహించని షాక్‌ ఎదురైంది. ప్రాణభయంతో వణికిపోతూ.. ‘బతుకు జీవుడా’ అంటూ ఎలాగోలా బయటపడ్డారు. చివరికి గమ్యస్థానానికి చేరేసరికి చేతిలో డబ్బుల్లేవు.. ఫోన్లూ లేవు.. దాదాపు బికారీలుగా మిగిలిపోయారు!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ హైవేపై కరాచీ ఫుట్‌బాల్‌ జట్టుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. క్వెట్టాలో జరగనున్న చీఫ్‌ మినిస్టర్స్‌ గోల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న కరాచీ డిస్ట్రిక్ట్‌ వెస్ట్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ బస్సును బలూచ్‌ సాయుధులు అడ్డగించారు. ఆటగాళ్లను తుపాకులతో బెదిరించి బస్సు నుంచి కిందకు దింపి.. నగదు, మొబైల్‌ ఫోన్లు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మస్తుంగ్‌–సారియాబ్‌ మధ్య చోటుచేసుకుంది.

సుమారు 12 మంది సాయుధులు బస్సును అడ్డగించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. బస్సులో ఉన్న వారందరినీ కిందకు దిగాలని ఆదేశించిన దుండగులు.. ఒక్కొక్కరి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లు, నగదు, ఇతర విలువైన వస్తువులను తీసుకున్నారు. కొందరు ప్రయాణికులను తుపాకుల మడమలతో కొట్టినట్లు టీమ్‌ మేనేజర్‌ జుల్ఫికార్‌ అలీ భుట్టో తెలిపారు. దోపిడీ తర్వాత బస్సును వదిలేయడంతో జట్టు క్వెట్టాకు చేరుకుంది. అయితే అప్పటికే ఆటగాళ్ల వద్ద కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న బలూచిస్థాన్‌ క్రీడల మంత్రి.. ఆటగాళ్లకు రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు అందేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ముందే హెచ్చరించారు.. అయినా వెళ్లారు!
అసలు ట్విస్ట్‌ ఇక్కడే. క్వెట్టాకు రోడ్డు, రైలు మార్గంలో వెళ్లొద్దని ఫుట్‌బాల్‌ అధికారులు ముందే హెచ్చరించినట్లు సింధ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహమ్మద్‌ అజమ్‌ తెలిపారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా సింధ్‌ జట్టును కూడా టోర్నమెంట్‌కు పంపలేదని చెప్పారు. కరాచీలోని ఇతర క్లబ్‌లకు కూడా బస్సు, రైలు మార్గాల్లో క్వెట్టాకు వెళ్లొద్దని సూచించినట్లు వెల్లడించారు. అయితే కరాచీ డిస్ట్రిక్ట్‌ వెస్ట్‌ జట్టు మాత్రం క్వెట్టాకు బయలుదేరింది. చివరకు తాము భయపడిన ఘటననే ఎదుర్కోవాల్సి వచ్చిందని అజమ్‌ పేర్కొన్నారు. పంజాబ్‌, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ఫుట్‌బాల్‌ సంఘాలు కూడా తమ జట్లను ఈ టోర్నమెంట్‌కు పంపలేదని తెలిపారు.

హైవేపై వరుస ఘటనలు
బలూచిస్థాన్‌లోని హైవేలపై భద్రతా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ ఘటన మరోసారి బయటపెట్టింది. మస్తుంగ్‌–క్వెట్టా మార్గం సాయుధ గ్రూపుల కార్యకలాపాలకు సున్నిత ప్రాంతంగా మారిందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఫుట్‌బాల్‌ జట్టుపై దాడికి కొద్దిరోజుల ముందే డేరా బుగ్టీలో ఇద్దరు స్థానిక క్రికెటర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో కలాట్‌ సమీపంలోని చమన్‌–కరాచీ ఎన్‌-25 హైవేపై సెప్టెంబర్‌ 18–19 రాత్రి భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో 23 మంది అపహృతులను విడిపించామని పాకిస్థాన్‌ సైన్యం తెలిపింది. ఐదుగురు మిలిటెంట్లు హతమైనట్లు ప్రకటించింది. అక్కడి సాయుధులు ప్రయాణికులను కిడ్నాప్‌ చేసి విముక్తి రుసుము వసూలు చేయడం, వాహనాలను దోచుకోవడం కోసం చెక్‌పోస్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని సైన్యం పేర్కొంది.

దోపిడీలతో మిలిటెంట్‌ కార్యకలాపాలకు నిధులు?
హైవేలపై దోపిడీలు, అక్రమ వసూళ్లు, కిడ్నాప్‌లు బలూచిస్థాన్‌లో భద్రతా సమస్యగా మారాయి. ఈ తరహా నేరాల ద్వారా మిలిటెంట్‌ కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయని బలూచిస్థాన్‌ హోం మంత్రి జియావుల్లా లాంగోవే సెప్టెంబర్‌లో క్వెట్టాలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆరోపించారు. తాజా ఘటనతో క్వెట్టా వెళ్లే మార్గాల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ రోడ్డు మార్గంలో వెళ్లిన కరాచీ ఫుట్‌బాల్‌ జట్టు.. చివరకు తుపాకుల మధ్య దోపిడీకి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: బంగ్లాకు పాక్‌తో కొత్త తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement