ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా నుంచి భారీ సుంకాల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి రష్యా చమురు ప్రధాన కొనుగోలుదారులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. కొత్తగా తీసుకొచ్చిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ మరో రెండు వారాల్లో ఆచరణలోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక్కడే రష్యా చమురు రంగంలో భారత కంపెనీలకు ఉన్న భారీ వాటా తెరపైకి వస్తోంది. రష్యా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం రోస్‌నెఫ్ట్ అనుబంధ సంస్థ అయిన వాంకోర్నెఫ్ట్‌లో భారత ప్రభుత్వ రంగ సంస్థలకు కలిపి 49.9 శాతం వాటా ఉంది. ఓఎన్‌జీసీ విదేశ్‌కు 26 శాతం వాటా ఉండగా.. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోరిసోర్సెస్ కలిసి వాంకోర్ ఇండియా ద్వారా మరో 23.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన 50.1 శాతం రోస్‌నెఫ్ట్ వద్ద ఉంది.
అంటే.. భారత్ రష్యా నుంచి చమురును కేవలం బయట నుంచి కొనుగోలు చేయడమే కాదు. రష్యాలోని చమురు ఉత్పత్తి ఆస్తిలోనే భారత కంపెనీలకు వాటా ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఈ వాటా ఆధారంగా భారత్ తనకు వచ్చే చమురును ‘భారత చమురు’గా చూపించి అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోగలదా?
రష్యా చమురు.. భారత్‌దిగా మారుతుందా?
కానే కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక భారత కంపెనీకి రష్యా చమురు క్షేత్రంలో వాటా ఉన్నంత మాత్రాన.. అక్కడి నుంచి వెలికితీసిన ముడిచమురు భారత మూలం గల చమురుగా మారదు. చమురు ఎక్కడ వెలికితీశారన్నదే దాని మూలాన్ని నిర్ణయిస్తుంది. రష్యాలో ఉత్పత్తి అయితే అది రష్యా మూలం గల క్రూడ్‌గానే ఉంటుంది.
ఒకవేళ భారత కంపెనీలు తమ వాటాకు అనుగుణంగా చమురును నేరుగా తీసుకుని భారత్‌కు తరలించినా ఇదే వర్తిస్తుంది. మూడో దేశం మీదుగా పంపినా దాని మూలం మారదు. కాబట్టి 49.9 శాతం వాటా ఉండటం వాణిజ్యపరంగా భారత్‌కు ప్రయోజనం కావచ్చు కానీ.. అమెరికా ఆంక్షల నుంచి ఆటోమేటిక్‌గా మినహాయింపు మాత్రం ఇవ్వదు.
మరి ఈ వాటాతో..
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత కంపెనీలకు వాంకోర్నెఫ్ట్‌లో వాటా ఉండటం వల్ల ఉత్పత్తిపై ఆర్థిక హక్కు ఉంటుంది. సాధారణంగా రష్యా కంపెనీ నుంచి మార్కెట్‌లో చమురు కొనుగోలు చేసే బదులు.. వాటాదారుగా ఉత్పత్తిలో తమ వాటాకు సంబంధించిన హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒప్పందాలు, చెల్లింపులు, మధ్యవర్తులు, రవాణా వంటి వ్యవహారాల్లో మార్పులు రావచ్చు. అలాగని ఇది అమెరికా ఆంక్షలను తప్పించే ప్రత్యేక మినహాయింపు అని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఏ లావాదేవీకి ఆంక్షలు వర్తిస్తాయన్నది ఉత్పత్తి చేసే సంస్థ, లావాదేవీలోని భాగస్వాములు, చెల్లింపుల విధానం, షిప్పింగ్, బీమా తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వాంకోర్.. వోస్టోక్ ఆయిల్‌కు సంబంధమేంటి?
ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. భారత కంపెనీల 49.9 శాతం వాటా మొత్తం వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో కాదు.. వాంకోర్నెఫ్ట్‌లో ఉంది. వాంకోర్ చమురు క్షేత్రాలు మాత్రం భారీ వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. రష్యా సెప్టెంబర్‌లో వోస్టోక్ ఆయిల్ నుంచి వాణిజ్య చమురు ఎగుమతులను ప్రారంభించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ భారీ ప్రాజెక్టును రష్యా భవిష్యత్తులో కీలక చమురు ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. దీంతో వాంకోర్నెఫ్ట్‌లో భారత కంపెనీల వాటా మరోసారి చర్చలోకి వచ్చింది.
అమెరికా ఆంక్షల మాటేంటి?
ఈ పరిణామాలతో అమెరికా ఆంక్షల గండం భారత్‌కు తప్పినట్లేనా?. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన విషయం. భారత్‌కు రష్యా చమురు ఉత్పత్తి ఆస్తిలో 49.9 శాతం వాటా ఉన్నప్పటికీ.. ఆ చమురు రష్యాలోనే వెలికితీస్తున్నారు. అందువల్ల దాని మూలం రష్యాదే. కాబట్టి భారత వాటాను చూపించి అమెరికా కొత్త చట్టం కింద వచ్చే సుంకాలు, ఆంక్షల నుంచి పూర్తిగా బయటపడే మార్గం ఏర్పడిందని చెప్పడానికి ఆధారం లేదు. అంటే.. భారత్ చేతిలో ఉన్న 49.9 శాతం వాటా ఒక కీలక వాణిజ్య బలం కావచ్చు. కానీ అదే అమెరికా ఆంక్షలకు కవచంగా మారుతుందా అన్నది మాత్రం అమెరికా నిబంధనల అమలు, లావాదేవీ నిర్మాణం, భవిష్యత్తు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట.
ఇదీ చదవండి: ట్రంప్‌ని ఎంత పెద్ద మాట అన్నాడు సర్?


