మెట్టు దిగిన ఇరాన్‌?.. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం | US Iran War: Fresh Talks Through Mediators to End Hormuz Deal in Focus | Sakshi
Sakshi News home page

మెట్టు దిగిన ఇరాన్‌?.. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం

Sep 29 2026 7:09 AM | Updated on Sep 29 2026 9:31 AM

US Iran War: Fresh Talks Through Mediators to End Hormuz Deal in Focus

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్‌ నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. సోమవారం ఇరు దేశాల అధికారులు మధ్యవర్తులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తాజా దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.

ఇరాన్‌ గత వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను కొద్దిగా సవరించి తాజా చర్చల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. ఖతార్‌ మధ్యవర్తులు న్యూయార్క్‌లో ఉన్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతో, అలాగే అమెరికా వర్గాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  

యుద్ధంలో అమెరికాదే విజయం: ట్రంప్‌
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, అమెరికా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. సోమవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌.. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధికారులు మధ్యవర్తులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “మేం గెలవబోతున్నాం. నా వరకు ఇది ఎలాగైనా సరే జరుగుతుంది. చాలా త్వరగానే ఇది ముగిసిపోతుంది” అని ట్రంప్‌ పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత గ్యాస్‌ ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.

ఇరాన్‌ కీలక ప్రతిపాదన ఇదే..
ఇరాన్‌ ప్రతిపాదనలో ప్రధానంగా యుద్ధాన్ని నిలిపివేయడం, లెబనాన్‌లోనూ శత్రుత్వ చర్యలకు ముగింపు పలకడం, ఫ్రీజ్‌ చేసిన తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్‌ చమురుపై ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్‌ పోర్టులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించాలని కోరుతోంది.

దీనికి ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రతిపాదించింది. శుద్ధిచేసిన యురేనియం అంశంపైనా చర్చలు జరపాలని అమెరికా కోరుతోంది. 

..అయినా చర్చలకు గ్రీన్‌ సిగ్నల్‌
ఇరాన్‌ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం తిరస్కరించినట్లు ప్రకటించారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరాన్‌ వేగంగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆదివారం ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ వారంలో అమెరికా ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్‌ తెలిపారు. సోమవారం కూడా మధ్యవర్తులతో అమెరికా అధికారులు మాట్లాడినట్లు వైట్‌హౌస్‌లో ట్రంప్‌ వెల్లడించారు. 

మరోవైపు, అమెరికా అధికారికంగా తమ ప్రతిపాదనను తిరస్కరించిన సమాచారం తమకు ఇంకా అందలేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చీ చెబుతున్నారు. వాషింగ్టన్‌ నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. శాంతియుత పరిష్కారం కోరుకుంటే తాము ఇప్పటికే పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించామని పేర్కొన్నారు. 

హర్ముజ్‌పైనే అసలు పట్టు
ప్రస్తుత చర్చల్లో హర్ముజ్‌ జలసంధి కీలక అంశంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ ఇంధన రవాణాలో భారీగా చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. సోమవారం కూడా దౌత్య ప్రయత్నాలపై ఆశలు, యుద్ధంపై ఆందోళనల మధ్య చమురు ధరలు పెరిగాయి.

గతంలో ఏప్రిల్‌, జూన్‌లో మధ్యవర్తుల ప్రయత్నాలతో కాల్పుల విరమణలు కుదిరినా అవి ఎక్కువకాలం కొనసాగలేదు.  అయితే ఇప్పుడు ఇరాన్‌ మాత్రం తమ షరతులు నెరవేరిన తర్వాతే హర్ముజ్‌ను పూర్తిగా తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీంతో తాజా మధ్యవర్తిత్వ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేదంటే మరోసారి విఫలమవుతాయా?.. రాబోయే రోజుల్లో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: ఎల్‌ నినో ఏం చేయబోతోందో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement