దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం! | Young Hearts at Risk Indians Dominate Cardiac Patients in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం!

Sep 29 2026 10:03 AM | Updated on Sep 29 2026 10:29 AM

Young Hearts at Risk Indians Dominate Cardiac Patients in Dubai

దుబాయ్: యూఏఈలో గుండె సంబంధిత చికిత్సలు పొందుతున్న వారిలో భారతీయులు, పాకిస్థానీలు అధికంగా ఉన్నారని దుబాయ్‌లోని ఆస్టర్ హాస్పిటల్ మంక్‌హూల్ గణాంకాలు వెల్లడించాయి. ఆస్పత్రిలోని కార్డియాక్ క్యాథెటరైజేషన్ (క్యాథ్) ల్యాబ్ 10,000 ప్రక్రియలను పూర్తి చేసిన సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

ఆస్పత్రిలో 3,500 మందికి పైగా రోగులపై నిర్వహించిన విశ్లేషణలో 90 శాతానికి పైగా దక్షిణాసియా ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. వీరిలో భారతీయులు 65 శాతానికి పైగా ఉండగా, తర్వాతి స్థానాల్లో పాకిస్థానీ, ఫిలిపిన్స్‌ బాధితులు ఉన్నారు. మరో 6,000 మందికి పైగా రోగుల విశ్లేషణలో 35 శాతానికి పైగా 41–50 ఏళ్ల మధ్య వయసున్నవారు ఉన్నారు. మరో 15–20 శాతం మంది 31–40 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. అంటే దాదాపు సగం మంది 31–50 ఏళ్ల మధ్య వయసున్నవారే.

వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆస్టర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ యూఏఈ కార్డియాక్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ నవీద్ అహ్మద్ తెలిపారు. తాను చికిత్స చేసిన అత్యంత చిన్న వయస్కుడు 19 ఏళ్ల భారతీయ కార్మికుడని చెప్పారు. 20 ఏళ్లలోపు గుండెపోటు కేసులు చాలా అరుదని, జన్యుపరమైన కారణాలతో కొలెస్ట్రాల్ అధికమై చిన్న వయసులోనే గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.

దక్షిణాసియా ప్రజల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉండటానికి జన్యుపరమైన అంశాలతో పాటు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయని డాక్టర్ నవీద్ తెలిపారు. యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తమకు ఉన్న ప్రమాద కారకాలను తెలుసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం అవసరమన్నారు. ధూమపానాన్ని పూర్తిగా మానేయాలని సూచించారు.

2018లో ప్రారంభమైన క్యాథ్ ల్యాబ్‌లో 2019 నుంచి ఏడాదికి సగటున 1,200కు పైగా ప్రక్రియలు జరిగాయి. 2025లో సుమారు 1,470 ప్రక్రియలు నిర్వహించగా, 2026లో ఈ సంఖ్య 1,600కు చేరుతుందని ఆస్పత్రి అంచనా వేస్తోంది. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తే అవకాశం ఉండటంతో క్యాథ్ ల్యాబ్ 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ పనిచేస్తోందని ఆసుపత్రి సీఈఓ డాక్టర్ షెర్బాజ్ బిచు తెలిపారు. గుండె జబ్బులు తీవ్ర దశకు చేరిన తర్వాత చికిత్స చేయడం మాత్రమే కాకుండా, ముందస్తు నివారణ, త్వరిత గుర్తింపుపై కూడా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: మయన్మార్‌లో వైమానిక దాడి.. 49 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement