సీఈసీ జ్ఞానేశ్‌ ఎపిసోడ్‌.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం? | INDIA Bloc to Meet in Delhi Over CEC Gyanesh Kumar Episode | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్‌ ఎపిసోడ్‌.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం?

Sep 29 2026 9:18 AM | Updated on Sep 29 2026 9:22 AM

INDIA Bloc to Meet in Delhi Over CEC Gyanesh Kumar Episode

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో.. ఇండియా కూటమి నేతలు రేపు (సెప్టెంబర్‌ 30) ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగే ఈ భేటీలో జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంటులో మరోసారి అభిశంసన/రిమూవల్‌ మోషన్‌ తీసుకొచ్చే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

సీఈసీపై తాజా రాజకీయ దుమారం మధ్య ఇండియా కూటమి పార్టీల మధ్య సమన్వయం పెరుగుతోంది. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) తదితర పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే డీఎంకే హాజరుపై ఇంకా స్పష్టత లేదు.

మళ్లీ అభిశంసన తీర్మానం?
కాగా, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి తొలగింపు తీర్మానం తీసుకొచ్చే దిశగా ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, తాజా నోటీసును లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంతకాల సేకరణపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇది ప్రతిపక్షాల నుంచి జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని కోరుతూ చేపట్టే మూడో ప్రయత్నం కావచ్చని వార్తలు వెలువడ్డాయి.

సీఈసీని తొలగించే ప్రక్రియ సాధారణ తీర్మానంతో పూర్తయ్యేది కాదు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీలు తొలగింపు తీర్మానానికి నోటీసుపై సంతకం చేయాలి. తీర్మానం స్వీకరించిన తర్వాత ఆరోపణలపై విచారణ జరుగుతుంది. అనంతరం రెండు సభల్లోనూ మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు, హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.

‘సర్‌’పైనే ప్రధాన ఫోకస్‌
ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఉంది. సర్‌ ప్రక్రియ, ఎన్నికల సంఘం నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు, అభిప్రాయాల నమోదు సంస్థాగత ప్రక్రియలో సాధారణమేనని, తుది నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని చెబుతోంది.
ఇటీవల ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి.. SIRకు సంబంధించిన కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికలు వెలువడ్డాయి. ఈ పరిణామాల తర్వాతే ప్రతిపక్షాలు తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశాయి.

దేశవ్యాప్త ఆందోళనలపై చర్చ
రేపటి సమావేశంలో అభిశంసన తీర్మానంతో పాటు జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌, ఎన్నికల సంఘం నిర్ణయాలపై స్వతంత్ర విచారణ, దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంపైనా నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. వామపక్ష పార్టీలు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. మరోవైపు ఇండి కూటమి సమావేశం అనంతరం ప్రతిపక్ష నేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉందని సమాచారం.

బీజేపీ, ఈసీ వాదన ఏంటి?
ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తిరస్కరిస్తోంది. సర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎన్నికల పరాజయాల నుంచి దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా SIRకు సంబంధించిన తుది నిర్ణయాలు చట్టబద్ధమైన విధానాలను అనుసరించి, ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగా తీసుకున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30న జరిగే ఇండియా కూటమి భేటీ కీలకం కానుంది. 

ఇదీ చదవండి: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కఠిన ఆంక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement