సీఈవో సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్. చిత్రంలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నవీన్‌యాదవ్, అనిల్‌కుమార్‌యాదవ్, రామ్మోహన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, సర్వే సత్యనారాయణ తదితరులు
ఓటు హక్కును కాలరాస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది?: భట్టి
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన
సాక్షి, హైదరాబాద్: ‘ఓట్ల చోరీ’పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర ఎన్నికల కమిషనర్లే స్వయంగా అంగీకరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీ నామా చేయాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసనలో భాగంగా జ్ఞానేష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి భట్టి విక్రమార్క చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని హాజరయ్యారు. అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్‌లతో కలిసి ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ఓటు హక్కునే కాలరాస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యంపై, పౌరుల హక్కులపై కాంగ్రెస్‌కు సంపూర్ణ విశ్వాసం ఉందని , ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం భారత ప్రజలకు చెందిన రాజ్యాంగబద్ధ సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమగ్రంగా, ప్రజల విశ్వాసానికి తగిన విధంగా కొనసాగేలా చూడటం కూడా దాని అత్యంత కీలక బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ వ్యవస్థ, ఎన్నికల సమగ్రత, భారత ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నమోదు చేసినట్లు నివేదించబడిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రజా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడడం ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రజల విశ్వాసానికి తగిన విధంగా కొనసాగేలా చూడడం దాని అత్యంత కీలక బాధ్యత అన్నారు. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ప్రశ్నలు లేవనెత్తుతోందని, ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, నవీన్ యాదవ్, శంకరయ్య, సీనియర్ నాయకులు దానం నాగేందర్, కోదండరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్, టీపీసీసీ ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్, టీపీసీసీ ‘సర్’స్టేట్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


