ఛాతీ నొప్పా.. నిర్లక్ష్యం వద్దు | 22,699 cardiac emergency cases in Telangana state in a year | Sakshi
Sakshi News home page

ఛాతీ నొప్పా.. నిర్లక్ష్యం వద్దు

Sep 29 2026 6:09 AM | Updated on Sep 29 2026 6:09 AM

22,699 cardiac emergency cases in Telangana state in a year

రాష్ట్రంలో ఏడాదిలో 22,699 గుండె అత్యవసర కేసులు

సాక్షి, హైదరాబాద్‌: ఛాతీలో నొప్పి వస్తే చాలా మంది గ్యాస్‌ లేదా అజీర్తిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారని.. కానీ కొన్ని సందర్భాల్లో అదే నొప్పి గుండెకు రక్తం సరిగా అందట్లేదనడానికి సంకేతం కావచ్చని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అప్రమత్తం చేసింది. ఛాతీ నొప్పిని ఎలా గుర్తించాలి? ఎప్పుడు గుండె సమస్యగా అనుమానించాలి? ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలనే అంశాలపై తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఛాతీలో బిగుతుగా అనిపించడం, చేతులు/మెడ/వెన్ను వరకు నొప్పి వ్యాపించడం, ఆయాసం, ఒళ్లంతా చెమటలు పట్టడం, వికారం వంటి లక్షణాలను గుండె సంబంధిత సమస్యలకు హెచ్చరికలుగా పరిగణించాలని తాజా స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌ వర్క్‌ ఫ్లోలో ఐసీఎంఆర్‌ పేర్కొంది. వాటిలో ఏ లక్షణాన్నీ తేలికగా తీసుకోవద్దని సూచించింది. విశ్రాంతి సమయంలోనే ఛాతీ నొప్పి రావడం లేదా 20 నిమిషాలకు మించి నొప్పి కొనసాగడం అత్యవసర గుండె సమస్యకు సంకేతం కావచ్చని తెలిపింది. గతంలో వచ్చిన ఛాతీ నొప్పి అకస్మాత్తుగా ఎక్కువ కావడం, తక్కువ శ్రమకే నొప్పి రావడం లేదా కొత్తగా ఇలాంటి నొప్పి మొదలవడం కూడా నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలేనని వివరించింది. 

ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఇప్పుడు మధ్య వయసు్కల్లోనూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని.. రాష్ట్రంలో 2025లో అత్యవసర వైద్య సేవలకు సంబంధించి స్పందించిన కేసుల విశ్లేషణలో 31 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనే సుమారు 60 శాతం గుండె సంబంధిత కేసులు నమోదయ్యాయని ఈఎంఆర్‌ఐ గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈఎంఆర్‌ఐ–జీహెచ్‌ఎస్‌ సేవలకు స్పందించిన మొత్తం 8,08,755 అత్యవసర కేసుల్లో 22,699 కేసులు (3 శాతం) గుండె సంబంధిత సమస్యలకు సంబంధించినవి. వాటిలో ఛాతీ నొప్పికి సంబంధించిన కేసులు నెలకు సగటున 1,892, రోజుకు సుమారు 62 చొప్పున నమోదయ్యాయి. మొత్తం గుండె సంబంధిత కేసుల్లో 13,508 (దాదాపు 60 శాతం) 31–60 ఏళ్ల వయసు వారివే కావడం ఆందోళన కలిగిస్తోంది. 

గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ 
గుండె సంబంధమైన అత్యవసర కేసుల్లో 2025లో పురుషుల్లో 12,098 (53 శాతం), మహిళల్లో 10,607 (47 శాతం) కేసులు నమోదయ్యాయి. ధూమపానం, అధిక మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి అంశాలతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా నమోదైన గుండె సంబంధిత అత్యవసర కేసుల్లో పట్టణ ప్రాంతాలు ముందున్నాయి. పట్టణాల్లో 16,198 (71 శాతం), గ్రామీణ ప్రాంతాల్లో 5,094 (23 శాతం), గిరిజన ప్రాంతాల్లో 1,407 (6 శాతం) కేసులు నమోదయ్యాయి. జనాభా సాంద్రత, జీవనశైలి, వైద్య సేవలను ఆశ్రయించే ధోరణి వంటి అనేక అంశాలు ఈ వ్యత్యాసానికి కారణమయ్యే అవకాశం ఉంది. 

‘గోల్డెన్‌ అవర్‌’లో స్పందన కీలకం.. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సమాచార ప్రకారం గుండెపోటు అత్యవసర వైద్య పరిస్థితుల్లో మొదటిది. గుండెకు రక్తప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోవడంతో కొన్ని నిమిషాల్లోనే గుండె కండరానికి నష్టం ప్రారంభమై సమయం గడిచేకొద్దీ పెరుగుతుంది. మహిళలు, వృద్ధులు, మధుమేహం ఉన్నవారిలో సాధారణ ఛాతీ నొప్పి లేకుండానే ఆయాసం, అలసట, అజీర్తి లాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని డబ్లు్యహెచ్‌వో పేర్కొంది. ఛాతీ నొప్పి గుండెపోటు కారణంగానే వచ్చిందా లేదా అన్నది లక్షణాలను బట్టి మాత్రమే నిర్ధారించలేమని.. ఈ విషయంలో ఈసీజీ, కార్డియాక్‌ ట్రోపోనిన్‌ పరీక్షలు కీలకంగా ఉంటాయని డబ్లు్యహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు చెబుతున్నాయి. 
 
‘డోంట్‌ మిస్‌ ఎ బీట్‌’ 
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రపంచ హృదయ సమాఖ్య ‘డోంట్‌ మిస్‌ ఎ బీట్‌’ప్రచారాన్ని నిర్వహిస్తోంది. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచడం, లక్షణాలను ముందే గుర్తించడం, శారీరక చురుకుదనం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. రోజువారీ శారీరక చురుకుదనం గుండె ఆరోగ్యానికి కీలకమని డబ్లు్యహెచ్‌ఓ పేర్కొంటోంది. ఛాతీలో కొత్తగా నొప్పి లేదా బిగుతు మొదలైతే అది గ్యాస్‌ అని భావించి ఇంట్లోనే ఉండటం ప్రమాదకరం అని ఐసీఎంఆర్‌ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నొప్పితో పాటు ఆయాసం, చల్లటి చెమటలు, వికారం, తల తిరగడం లేదా చేతి/దవడ/వెన్నుకు నొప్పి వ్యాపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండెపోటు అనుమానం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరడం, వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొంటోంది. కాగా గుండె ఆరోగ్యానికి పొగతాగడం మానేయడం, ఉప్పు–కొవ్వు–చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, రక్తపోటు–మధుమేహం–కొలె్రస్టాల్‌ను నియంత్రణలో ఉంచడం వంటి చర్యలు సహాయపడతాయని స్పష్టం చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement