తమిళనాడు రాజకీయాల్లో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గతంలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ‘ఓం శక్తి.. పరాశక్తి’ నినాదాలతో టీవీకే అధినేత విజయ్ విరుచుకుపడ్డారు. అదే ఎన్నికల్లో బాగా వర్కవుట్ అయ్యింది కూడా. ఇప్పుడు.. ఉప ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ దానికి కౌంటర్‌గా సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
మదురాంతకంలో జరిగిన డీఎంకే సమావేశంలో ఉదయనిధి కొత్త నినాదాన్ని ప్రకటించారు. ‘ఓం కాళి.. జై కాళి.. టీవీకే ఒక ఒడుగాళి(తప్పించుకుని పారిపోయే పార్టీ)’ అంటూ పార్టీ శ్రేణులతో నినదించారు. గత రెండేళ్లుగా విజయ్ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ‘ఓం శక్తి.. పరాశక్తి..డీఎంకే ఒక థీయ శక్తి(దుష్ట శక్తి)’ నినాదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. అప్పట్లో తాము అధికారంలో ఉన్నామని.. ఆయన మాటలను తాము విన్నామని చెప్పారు. ఇప్పుడు సమాధానం ఇచ్చే అవకాశం తమకు వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. శాంతిభద్రతల వైఫ్యలంపై సమాధానం చెప్పకుండా విజయ్ తప్పించుకుని తిరుగుతున్నారని,పైగా రీల్స్.. ఫొటోషూట్‌ల మీదే టీవీకే సర్కార్ ఫోకస్ అంతా ఉంటుందోని మండిపడ్డారయన. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఉదయనిధి కీలక సూచన చేశారు. విజయ్ పేరును నేరుగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని.. ‘ఓం కాళి.. జై కాళి’తో పాటు టీవీకే పేరును ప్రస్తావిస్తూ ఈ నినాదాన్ని వినిపించాలని కోరారు. ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రచార సభల్లోనే కాకుండా రాబోయే రోజుల్లోనూ ప్రజలను కలిసిన ప్రతిచోటా, ఇంటింటి ప్రచారంలోనూ దీన్ని పునరావృతం చేయాలని సూచించారు.
కరూర్ ఘటనపైనా విమర్శలు
ఇదే సమయంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ ఉదయనిధి విజయ్‌పై విమర్శలు చేశారు. ఈ ఘటనలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఘటనపై ప్రత్యర్థి పార్టీ నాయకత్వం మీడియా, ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుందని ఆయన ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో కొత్త నినాదం
మదురాంతకం, ధారాపురం ఉపఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ప్రచారం వేడెక్కింది. ఈ నేపథ్యంలో విజయ్ నినాదానికి ప్రతిగా ఉదయనిధి కొత్త నినాదాన్ని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంలోనూ ఈ నినాదాన్ని విస్తృతంగా వినిపించాలని డీఎంకే శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు.. విజయ్ కూడా డీఎంకేను లక్ష్యంగా చేసుకుని తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ‘ఓం శక్తి’–‘ఓం కాళి’ నినాదాల చుట్టూ తమిళనాడు రాజకీయ ప్రచారంలో కొత్త పోరు మొదలైంది.


