రాజ్యసభ సమరం: 10 సీట్లు.. హైడ్రామా ఖాయం! | UP Rajya Sabha Elections: BJP Eyes 8th Seat SP Faces Tough Battle for 3rd | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సమరం: 10 సీట్లు.. హైడ్రామా ఖాయం!

Sep 29 2026 7:35 AM | Updated on Sep 29 2026 9:33 AM

UP Rajya Sabha Elections: BJP Eyes 8th Seat SP Faces Tough Battle for 3rd

ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. అక్టోబర్‌ 16న రాష్ట్రంలోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. పదో స్థానాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మంగళవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

బీజేపీ ఏడు స్థానాలను సులభంగా గెలుచుకునే స్థితిలో ఉంది. అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిదో స్థానానికీ పోటీ చేయాలని భావిస్తోంది. ఇందు కోసం మరో నాలుగు ఓట్లు అవసరమవుతాయి. బీజేపీకి ప్రస్తుతం 255 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అప్నాదళ్‌ (సోనేలాల్‌), ఆర్‌ఎల్‌డీ, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, నిషాద్‌ పార్టీ వంటి మిత్రపక్షాల బలంతో కలిపి ఎనిమిదో స్థానంపై ఆశలు పెట్టుకుంది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ఈ స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

సామాజిక సమీకరణాలతో..
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఓబీసీలు, జాట్లు, రాజ్‌పుత్‌లు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. బ్రాహ్మణ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంతో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లో దూరమైన నాన్‌-యాదవ్‌ ఓబీసీ, ముఖ్యంగా కుర్మీ, నాన్‌-జాటవ్‌ ఎస్సీ వర్గాలను తిరిగి తమవైపు తిప్పుకునే వ్యూహంపై దృష్టి పెట్టింది.

లక్నోలో సోమవారం జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులపై విస్తృతంగా చర్చ జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. ఇటీవలే పార్టీ జాతీయ సంస్థాగత బాధ్యతలు దక్కించుకున్న ఆమెకు రాజ్యసభ అవకాశం కల్పించే అంశంపై బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ(పిలిభిత్‌) వరుణ్‌ గాంధీ పేరు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. వీరితో పాటు హరీశ్‌ ద్వివేదీ, సంజీవ్‌ బాలియాన్‌, సత్యపాల్‌ సింగ్‌, సురేశ్‌ రాణా తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ మరో మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న కొందరికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ పదవీకాలం ముగియనుండగా.. ఆయనను తిరిగి రాజ్యసభకు పంపే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. దళిత ప్రాతినిధ్యంలోనూ మార్పులు చేయాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎస్పీ.. ప్చ్‌ మూడో సీటు కష్టమే!
మరోవైపు ఎస్పీ మూడు స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశం ఉంది. పార్టీకి ప్రస్తుతం 101 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతుతో సంఖ్య 103కు చేరుతుంది. ఈ బలంతో రెండు స్థానాలు గెలుచుకున్న తర్వాత మూడో స్థానానికి అవసరమైన అదనపు ఓట్ల కోసం ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.

మాజీ మంత్రి, సీనియర్‌ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపే అంశాన్ని ఎస్పీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మాజీ ఐఏఎస్‌ అధికారి అలోక్‌ రంజన్‌, సలీం ఇక్బాల్‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పదో సీటుపైనే ఉత్కంఠ
403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం 396 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడానికి 37 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ఈ లెక్కల ప్రకారం బీజేపీ ఏడు స్థానాలను గెలుచుకున్న తర్వాత కూడా అదనపు ఓట్లు మిగులుతాయి. మరోవైపు ఎస్పీ రెండు స్థానాలను గెలుచుకున్న తర్వాత మూడో సీటుకు మరిన్ని ఓట్లు సమీకరించాల్సి ఉంటుంది.

రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ వర్తించకపోవడంతో క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. దీంతో పదో స్థానంపై బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇరు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల తుది జాబితా, మిత్రపక్షాల వైఖరి, చివరి దశలో జరిగే సమీకరణాలు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించనున్నాయి.

ఇదీ చదవండి: మాయావతి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement