యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో | Supreme Court Rejects Stay on UPI Charges Latest Verdict Means for Users | Sakshi
Sakshi News home page

యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో

Sep 29 2026 8:19 AM | Updated on Sep 29 2026 8:19 AM

Supreme Court Rejects Stay on UPI Charges Latest Verdict Means for Users

వ్యాపారస్తులకు రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపుల మీద ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌) చార్జీలు విధించాలన్న కేంద్రం నిర్ణయంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎండీఆర్‌ విధింపుపై నాలుగు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐకి నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. యూపీఐ లావాదేవీలు దాదాపు గత ఆరేళ్లుగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే, వ్యాపారవర్గాలకు  కొనుగోలుదారులు రూ. 2,000కు పైబడి జరిపే చెల్లింపులపై 0.4 శాతం ఫీజును విధిస్తూ కేంద్రం ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం వ్యాపారవర్గాలే చెల్లించాల్సి ఉంటుందని, వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే, దీన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్‌ అంజన్‌ దత్తా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  

దీనిపై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన బెంచ్‌ ఈ చార్జీల విధింపునకు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని కేంద్రానికి సూచించింది. యూపీఐ మొత్తం లావాదేవీల్లో 96% వరకు చార్జీల పరిధిలోకి రావని, నిర్దిష్ట సేవలకు సంబంధించిన లావాదేవీలపై చార్జీని రూ.5కు ప్రభుత్వం పరిమితం చేసిందని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌ వెంకటరమణ వివరించారు. యూపీఐ వ్యవస్థను నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థలకయ్యే వ్యయాల భారాన్ని తగ్గించేందుకే దీన్ని విధిస్తున్నట్లు, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి చేకూరదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement