ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్! | Mobile Retailers to Observe No UPI Day on October 2 Over MDR Charges | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్!

Sep 28 2026 6:39 PM | Updated on Sep 28 2026 6:46 PM

Mobile Retailers to Observe No UPI Day on October 2 Over MDR Charges

యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధంచాలనే.. నిర్ణయానికి వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ రిటెయిలర్లు నిరసనకు సిద్ధమవుతున్నారు. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించే ప్రతిపాదన తమ వ్యాపారాలపై అదనపు భారం పెంచుతుందని రిటెయిలర్లు చెబుతున్నారు.

ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ (AIMRA) అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించాలని ప్రకటించింది. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా వేలాది మొబైల్ షాపుల యజమానులు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించకుండా నిరసన తెలపనున్నారు.

కేవలం క్యాష్, కార్డు పేమెంట్స్ మాత్రమే
నిరసనలో భాగంగా మొబైల్ షాపుల్లో ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్ స్టాండ్లను నల్లటి గుడ్డతో కప్పివేయనున్నట్లు సమాచారం. ఆ రోజు కస్టమర్ల నుంచి యూపీఐ లేదా క్యూఆర్ స్కాన్ ద్వారా చెల్లింపులు తీసుకోకుండా.. నగదు లేదా కార్డు ద్వారా మాత్రమే పేమెంట్లు స్వీకరించాలని రిటెయిలర్లు నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది.

వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించకుండా.. ప్రస్తుతం ఉన్న జీరో-ఎండీఆర్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసినట్లు ఏఐఎంఆర్ఏ వెల్లడించింది.

ఆదాయం తగ్గే అవకాశం!
రిటెయిలర్ల ప్రకారం.. ముఖ్యంగా చిన్న వ్యాపారులపై ఈ ఛార్జీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలకు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేసే వ్యాపారులకు 0.4 శాతం ఎండీఆర్ కూడా గణనీయమైన భారంగా మారుతుందని వారు చెబుతున్నారు. దీనివల్ల నెలకు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తర్వీంద్ సింగ్ పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్ రిటెయిల్ వ్యాపారంలో ఇప్పటికే లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అదనంగా 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ విధిస్తే తమ లాభాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రిటెయిలర్లపై నెలకు సుమారు రూ.40 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అసోసియేషన్ అంచనా.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మొబైల్ రిటెయిలర్లు కోరుతున్నారు. తమ వ్యాపారాల్లో యూపీఐ వినియోగం పెరిగిన నేపథ్యంలో కొత్త ఎండీఆర్ ఛార్జీలు అమలైతే, దాని ప్రభావం నేరుగా తమ లాభాలపై పడుతుందని చెబుతున్నారు. అందుకే జీరో-ఎండీఆర్ ఛార్జీ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: కేవలం రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షలు అకౌంట్లోకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement