యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎండీఆర్ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయరని ఆమె తెలిపారు. ఈ ఛార్జీలను వ్యాపారులు, బ్యాంకులు, చెల్లింపుల వ్యవస్థలోని ఇతర భాగస్వాములు భరిస్తారని స్పష్టం చేశారు.
ఎండీఆర్ అనేది ప్రభుత్వం విధించే పన్ను లేదా సెస్ కాదని సీతారామన్ వివరించారు. యూపీఐ లావాదేవీలకు సంబంధించి జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ), చెల్లింపు అగ్రిగేటర్లు, సేవలందించే సంస్థలు, పీఓఎస్ యంత్రాల ప్రొవైడర్లు, మర్చంట్ బ్యాంకులు వంటి సంస్థలు అందించే సేవలకు సంబంధించిన ఛార్జీగా దీనిని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని, ప్రభుత్వం దీనిని విధించడం లేదని స్పష్టం చేశారు.
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ఎండీఆర్ భారం వినియోగదారులకు బదిలీ అవుతుందన్న వాదనలను ఆమె తోసిపుచ్చారు. ఈ ఛార్జీని కస్టమర్ల బిల్లులో అదనపు ఖర్చుగా చూపించరాదని తెలిపారు. రూ.2,000లోపు యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి కూడా ఎండీఆర్ వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫోన్ రీచార్జ్‌లపై గుడ్‌న్యూస్.. చౌక ప్లాన్లు వస్తున్నాయ్!


