మొబైల్ డేటా పెద్దగా ఉపయోగించని వినియోగదారులకు త్వరలో మరిన్ని రీచార్జ్ ఎంపికలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం కాల్స్, ఎస్ఎంఎస్‌ల కోసం మొబైల్ కనెక్షన్ ఉపయోగించే కస్టమర్లు అవసరం లేని డేటాకు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక ప్రతిపాదన చేసింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు డేటా లేకుండా కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందించే ప్రత్యేక ప్లాన్లను మరిన్ని కాలపరిమితుల్లో అందించాలని ప్రతిపాదించింది.
ప్రస్తుతం వాయిస్+ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ఎంపికలు పరిమితంగానే ఉన్నాయని ట్రాయ్ గుర్తించింది. 2024 డిసెంబరులో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి ఆపరేటర్ కనీసం ఒక వాయిస్+ఎస్ఎంఎస్ ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను అందించాల్సి వచ్చింది. దీని గరిష్ఠ చెల్లుబాటు 365 రోజులు ఉండొచ్చు. అయితే ఆ తర్వాత ఎక్కువగా 80/84 రోజులు లేదా 336/365 రోజుల వంటి దీర్ఘకాలిక ప్లాన్లే అందుబాటులో ఉన్నాయని ట్రాయ్ తన తాజా ప్రతిపాదనలో పేర్కొంది. దీంతో తక్కువ కాలానికి రీచార్జ్ చేసుకోవాలనుకునే, ముఖ్యంగా డేటా అవసరం లేని వినియోగదారులకు ఎంపికలు తగ్గిపోయాయని తెలిపింది.
28, 30 రోజుల ప్లాన్లకూ ప్రత్యేక ఆప్షన్?
ట్రాయ్ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఒక టెలికాం సంస్థ 28 రోజుల చెల్లుబాటుతో వాయిస్, ఎస్ఎంఎస్, డేటా కలిపిన ప్లాన్ అందిస్తే, అదే 28 రోజుల చెల్లుబాటుతో కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలతో ప్రత్యేక ప్లాన్ కూడా అందించాల్సి ఉంటుంది. ఇదే విధంగా సంస్థలు అందించే ఇతర ప్రత్యేక టారిఫ్ వోచర్ల ప్రతి ప్రత్యేక చెల్లుబాటు కాలానికి అనుగుణంగా వాయిస్+ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కేవలం 28 లేదా 30 రోజులకే పరిమితం కాకుండా, ఆపరేటర్ ప్రస్తుతం అందిస్తున్న ప్రతి సంబంధిత చెల్లుబాటు కాలానికి వాయిస్+ఎస్ఎంఎస్ ఆప్షన్ ఉండాలన్నది ప్రతిపాదనలోని ప్రధాన అంశం.
ఇక ధరల విషయంలోనూ ట్రాయ్ కీలక మార్గదర్శకాన్ని ప్రతిపాదించింది. డేటాను తొలగించినంత మాత్రాన అదే ధరను కొనసాగించకుండా, సంబంధిత డేటా-బండిల్‌డ్ ప్లాన్‌తో పోలిస్తే ‘గణనీయంగా అనుపాత తగ్గింపు’ ఉండాలని పేర్కొంది. అయితే ప్రతి ప్లాన్‌కు ఎన్ని రూపాయలు తగ్గించాలనే ఒక స్థిరమైన ధర లేదా శాతం ట్రాయ్ నిర్ణయించలేదు. కాబట్టి భవిష్యత్తులో జియో, ఎయిర్‌టెల్, వీఐ తదితర సంస్థలు తమ ప్లాన్ల ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది.
ఎందుకీ మార్పు?
వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు, ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, మొబైల్ డేటా అవసరం తక్కువగా ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ ఈ మార్పును ప్రతిపాదించింది. డేటా అవసరం లేకపోయినా డేటాతో కూడిన రీచార్జ్ తీసుకోవాల్సి వస్తే వినియోగదారులకు అదనపు ఖర్చు అవుతుందని నియంత్రణ సంస్థ అభిప్రాయపడింది. అందుకే డేటా వాడని కస్టమర్లకు కూడా డేటా ఉపయోగించే వారితో సమానంగా వివిధ చెల్లుబాటు కాలాల్లో ఎంపికలు ఉండాలని పేర్కొంది.
మరోవైపు, ఈ ప్లాన్లను వినియోగదారులు సులభంగా గుర్తించేలా చేయాలని కూడా ట్రాయ్ ప్రతిపాదించింది. టెలికాం సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, కస్టమర్ కేర్ కేంద్రాలు, రిటైల్ దుకాణాలు తదితర చోట్ల వాయిస్+ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్లను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది.


