ఈ రోజుల్లో విదేశాలకు వెళ్లాలనుకునే చాలామంది భారతీయులు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక దేశానికి ప్రయాణించాలంటే ముందుగా వీసా తీసుకోవాలి, ఎన్నో పత్రాలు సమర్పించాలి, కొన్నిసార్లు వారాల తరబడి వేచి ఉండాలి. ఈ సమస్యలపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త జితేంద్ర ఎమ్మాని తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.
జితేంద్ర ఎమ్మాని కోజీఫార్మ్స్.ఇన్ వ్యవస్థాపకుడు. ఆయన భారతీయ పాస్‌పోర్ట్‌ను విమర్శిస్తూ.. ''పూర్తిగా పనికిరానిది'' అని పేర్కొన్నారు. అంటే, మన పాస్‌పోర్ట్ వల్ల అంతర్జాతీయ ప్రయాణంలో పెద్దగా స్వేచ్ఛ లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జితేంద్ర తన పోస్టులో.. వీసా కోసం రోజుల తరబడి వేచి ఉండకుండా, వందలాది పత్రాలు సమర్పించకుండా.. మంచి దేశాలకు వెళ్లలేమని అన్నారు. భారతీయ పాస్‌పోర్ట్‌తో చాలా దేశాలకు వెళ్లాలంటే ముందుగానే వీసా పొందాల్సి రావడం, ఆ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు తనను నిరాశకు గురిచేస్తున్నాయని వెల్లడించారు.
అమెరికా వీసా ఉన్న భారతీయులకు కొన్ని ఇతర దేశాలకు ప్రయాణించే విషయంలో అదనపు సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. అందుకే.. కొంతమంది అమెరికా వీసాను ఒక రకమైన ప్రయాణ సౌలభ్యంగా భావిస్తారు. అయితే అమెరికా వీసా పొందడం కూడా అంత సులభం కాదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జితేంద్ర ఎమ్మాని, ''భారతీయ పాస్‌పోర్ట్‌కు ఇతర దేశాల్లో ప్రవేశం కల్పించడానికి అమెరికా వీసా ఎందుకు అవసరం?'' అని ప్రశ్నించారు.
ఇది కేవలం ప్రయాణ సమస్య గురించి మాత్రమే కాదు. ఒక భారతీయ పౌరుడు తన దేశంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, విదేశాలకు వెళ్లేటప్పుడు ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తోందనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.
ఏడాదికి రూ.కోటి ట్యాక్స్!
జితేంద్ర ఎమ్మాని ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పన్నులు చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తనకు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ తగిన ప్రయోజనాలు కనిపించడం లేదని అన్నారు.
పన్నులు చెల్లించే పౌరులకు మెరుగైన ప్రభుత్వ సేవలు, సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రయాణ అవకాశాలు ఉండాలని ఆశించడం సహజం. అదే సమయంలో.. భారతీయ పాస్‌పోర్ట్‌కు పరిమిత సౌకర్యాలు ఉండటం వల్ల చాలామంది ఇతర దేశాల పాస్‌పోర్ట్‌లు లేదా పౌరసత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని జితేంద్ర అన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, ప్రయాణ స్వేచ్ఛ వంటి కారణాలు కూడా కొంతమందిని ఇతర దేశాల పౌరసత్వం వైపు ఆకర్షించవచ్చు.
తన పోస్టు.. చివరలో జితేంద్ర ఎమ్మాని దేశ పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గతాన్ని నిందిస్తూ మరికొన్ని దశాబ్దాలు గడపకుండా, దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జితేంద్ర పోస్టు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది భారతీయులు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అంతర్జాతీయ ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయనతో ఏకీభవించారు. మరికొందరు భారతీయ పాస్‌పోర్ట్‌పై, వీసా నిబంధనలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Our Passport is absolutely useless.
Can’t go anywhere good without waiting for days for the Visa or submitting a thousand pages.
No wonder so many Indians are chasing other passports.
A valid US visa is the shortcut many use. Why do we need a US stamp to let an Indian…— Jitendra Emmani (@JitendraEmmani) September 22, 2026


