2007 తర్వాత అత్యధిక స్థాయికి అమెరికా బెంచ్‌మార్క్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరగడంతో, గురువారం నాడు బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ - నిఫ్టీ 1.5 శాతానికి పైగా పడిపోయాయి. బ్యాంకులు, NBFC స్టాక్‌లలో అమ్మకాలు, బలహీనమైన ప్రపంచ మార్కెట్ ధోరణులతో పాటుగా, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్లు సుమారు రూ. 6 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.
మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయానికి, సెన్సెక్స్ 1207.92 పాయింట్లు లేదా 1.61 శాతం తగ్గి 73,620.33 వద్ద ఉండగా, నిఫ్టీ 375.40 పాయింట్లు లేదా 1.6 శాతం తగ్గి 23,071.40కి పడిపోయింది. ఫార్మా, రియల్టీ రంగాలను మినహాయించి.. నిఫ్టీలోని అన్ని ప్రధాన రంగాల సూచీలు క్షీణించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 0.8 శాతం, 1.3 శాతం మేర పడిపోయాయి.
మార్కెట్ పతనానికి కారణాలు
అమెరికా వడ్డీ రేట్లు: అమెరికాలో బిజినెస్ యాక్టివిటీ బలంగా ఉందని కొత్త డేటా వచ్చింది. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం ఎక్కువ స్థాయిలో ఉంచే అవకాశం ఉందని పెట్టుబడిదారులు భావించారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, అమెరికా బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. దీంతో భారత్ వంటి మార్కెట్ల నుంచి కొంత పెట్టుబడి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ముడి చమురు ధరల పెరుగుదల: మార్కెట్లు కుప్ప కూలడానికి మరో ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరుగుదల. గత సెషన్‌లో 4 శాతం పెరిగిన బ్రెంట్ క్రూడ్, గురువారం బ్యారెల్‌కు సుమారు 102.5 డాలర్ల వద్దకు చేరింది. ఈ పరిణామం భారత్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇండియా చాలావరకు ముడిచమురును ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. కాబట్టి చమురు ధర పెరిగితే భారత్ ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రపంచ మార్కెట్లు: అమెరికా మార్కెట్లు కూడా బుధవారం భారీ పతనాన్ని చవిచూశాయి. యూఎస్ మార్కెట్లు పడిపోవడం వల్ల ఏషియన్ మార్కెట్ల మీద కూడా ప్రభావం పడింది.హాంగ్ కాంగ్, షాంఘై వంటి మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పుడు భారత మార్కెట్‌లో కూడా పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉంటారు.
లాభాల స్వీకరణ: బుధవారం, సెన్సెక్స్ 299.17 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 74,828.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117.80 పాయింట్లు లేదా 0.5 శాతం పెరిగి 23,446.80 వద్ద ముగిసింది. ఇలాంటి సమయంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకోవడానికి షేర్ విక్రయించారు.
రూపాయి పతనం: భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు, యూఎస్ బాండ్ల రాబడులు, అలాగే డాలర్ కూడా బలపడటంతో, రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 11 పైసలు క్షీణించి 95.84 వద్ద బలహీనపడింది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే.. డబ్బు అదే వస్తుంది: కియోసాకి


