ఆకాంక్షలు ఘనం.. ఆర్థిక సంసిద్ధత పరిమితం!
ఉద్యోగం నుంచి ముందస్తు విరమణ పొంది స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపాలని ఆశిస్తున్న పట్టణ భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే, ఆ ఆకాంక్షకు తగినట్లుగా ఆర్థిక సంసిద్ధత మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, కాంటార్ భాగస్వామ్యంతో నిర్వహించిన ‘భరోసా టాక్స్ ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (IRIS 6.0)’ ఆరో విడత అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 నాటికి భారత పట్టణ ప్రజల రిటైర్మెంట్ ఇండెక్స్ స్కోర్ 49గా నమోదైంది (2025లో 48).
ముందస్తు విరమణపై మక్కువ
అధ్యయనం ప్రకారం, ప్రతి పది మంది పట్టణ భారతీయుల్లో ఏడుగురు సంప్రదాయ పదవీ విరమణ వయస్సు (58–60 ఏళ్లు) కంటే ముందే రిటైర్ కావాలని కోరుకుంటున్నారు. వీరిలో సగం మంది 50 ఏళ్లలోనే ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, తాము నిర్దేశించుకున్న లక్ష్య నిధిలో సగటున కేవలం 28 శాతం మాత్రమే ఇప్పటివరకు సమకూర్చుకోవడం గమనార్హం. కేవలం 11 శాతం మంది మాత్రమే తమ పొదుపు జీవితాంతం సరిపోతుందని ధీమాగా ఉన్నారు.
చిన్న వయస్సులోనే పెట్టుబడుల బాట
ప్రస్తుతం యువత మొదటి జీతం అందుకున్నప్పటి నుంచే రిటైర్మెంట్ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నారు. సగటున 31 ఏళ్ల వయస్సులోనే ఈ ఆలోచన మొదలవుతుండగా జనరేషన్ జెడ్ (జెన్ జీ) విభాగంలో ఇది 29 ఏళ్లకే ప్రారంభమవుతోంది. జనరేషన్ జెడ్‌లో 62%, మిలీనియల్స్‌లో 70% మంది ఇప్పటికే పెట్టుబడులు మొదలుపెట్టారు.
ఆరోగ్య భద్రతకే తొలి ప్రాధాన్యం
రిటైర్మెంట్ జీవితంలో శారీరక దృఢత్వానికి భారతీయులు ప్రాధాన్యమిస్తున్నారు. 75 శాతం మంది పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుండగా, 52 శాతం మందికి ఆరోగ్య బీమా ఉంది. మరోవైపు, ఈ ఇండెక్స్‌లో ద్వితీయ శ్రేణి (టైర్-2) నగరాలు మెరుగైన ప్రగతిని సాధించి స్కోరును 44 నుంచి 48కి పెంచుకున్నాయి. మహిళల భరోసా టాక్స్ స్కోర్ పురుషులతో సమానంగా 49గా నమోదై ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సమతుల్య దృక్పథాన్ని ప్రదర్శించారు.
యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సీఈఓ సుమిత్ మదన్ తెలిపినట్లుగా.. పదవీ విరమణ అనేది కేవలం ఒక వయస్సుకు చేరుకోవడం కాదు. భవిష్యత్తును స్వేచ్ఛగా నిర్ణయించుకునే ఆర్థిక సామర్థ్యాన్ని సాధించడమే. సంకల్పం బలంగా ఉన్నప్పటికీ లక్ష్య నిధిని సమకూర్చుకోవడంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక భారతీయులకు తక్షణ అవసరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..


