కాసేప‌ట్లో లంక‌తో తొలి వ‌న్డే.. ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌ గుడ్‌బై | ENG Star Mark Wood Announces Retirement From International Cricket | Sakshi
Sakshi News home page

కాసేప‌ట్లో లంక‌తో తొలి వ‌న్డే.. ఇంగ్లండ్ స్టార్‌ క్రికెటర్‌ గుడ్‌బై

Sep 22 2026 2:32 PM | Updated on Sep 22 2026 2:50 PM

ENG Star Mark Wood Announces Retirement From International Cricket

Photo Credit: Twitter

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ మార్క్ వుడ్ మంగ‌ళ‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. త‌ర‌చూ గాయాల‌తో ఇబ్బంది ప‌డుతుండ‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు 36 ఏళ్ల మార్క్‌వుడ్ తెలిపాడు. త‌న రిటైర్మెంట్ విష‌యాన్ని మార్క్‌వుడ్ స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. 

గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ సంద‌ర్భంగా గాయ‌ప‌డిన మార్క్‌వుడ్ మ‌ళ్లీ ఇంగ్లండ్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌లేదు. అప్ప‌టి నుంచి ఒక గాయం త‌ర్వాత మ‌రో గాయం తిర‌గ‌బెట్ట‌డంతో దాదాపు 9 నెల‌లుగా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. దీంతో వ‌య‌సు రీత్యా రిటైర్మెంట్‌కు ఇదే స‌రైన స‌మ‌యమ‌ని మార్క్‌వుడ్ ఇన్‌స్టా వేదిక‌గా తెలిపాడు. 

‘‘అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంపై ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. దాదాపు ఏడాది కాలంగా ఆట‌కు దూరంగా ఉన్నాను. ఈసీబీతో నా కాంట్రాక్ట్ కూడా ముగిసింది. అందుకే నా వీడ్కోలుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని భావిస్తున్నా. క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించాను. 

గాయాల నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ మెడిక‌ల్ అడ్వైజ్ ప్ర‌కారం టెస్టు, వ‌న్డే క్రికెట్ ఫార్మాట్‌లో ఆడ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌ని అర్థ‌మైంది. అందుకే రిటైర్మెంట్‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాను. ఇంత‌కాలం నాకు అండ‌గా నిల‌బ‌డిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు" అని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌కు 2015 నుంచి 2025 మ‌ధ్య కాలంలో ప్రాతినిధ్యం వ‌హించిన మార్క్‌వుడ్ 38 టెస్టుల్లో 811 ప‌రుగులు చేయ‌డంతో పాటు 119 వికెట్లు తీశాడు. 70 వ‌న్డేల్లో 80 వికెట్లు, 38 టీ20ల్లో 54 వికెట్లు ప‌డ‌గొట్టాడు. స్వ‌దేశంలో శ్రీలంక‌తో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఇవాళ సాయంత్రం శ్రీలంక‌తో తొలి వ‌న్డే ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో మార్క్‌వుడ్ రిటైర్మెంట్ ఆస‌క్తి క‌లిగించింది.

ఇదీ చదవండి:  IND vs JPN: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి రెండు పరుగుల తేడాతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement