Photo Credit: Twitter
భారత క్రికెట్‌లో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయాలపై మరోసారి చర్చ మొదలైంది. అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా వచ్చిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఆయన హయాంలో సానుకూల అంశాలు చాలానే ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు మొదలు అనేక వివాదాలతో అగర్కార్ పదవికి మచ్చను తెచ్చిపెట్టేలా చేశాయి.
2027 ప్రపంచ కప్ కోసం రోహిత్‌ను జట్టులో ఉంచడానికి అతను సుముఖంగా లేనప్పటికీ, బోర్డు మాత్రం ఆ ఆటగాడికి మద్దతు ఇచ్చింది. అయితే నిజానికి అగార్కర్ పదవీకాలం ప్రారంభమైన నాటి నుంచే బీసీసీఐతో సమస్యలు మొదలయ్యాయని ‘ది టెలిగ్రాఫ్’ తమ నివేదికలో పేర్కొంది.
‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. 2023లో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన రెండో సమావేశంలోనే ఓ కీలక నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో జరగాల్సిన టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్సీ అంశం చర్చకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది.
ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌ను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని అగార్కర్ భావించినట్లు కథనం తెలిపింది. అనంతరం జరిగిన 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. యువ ఆటగాడికి నాయకత్వ అనుభవం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఉపయోగపడేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
అయితే బీసీసీఐ మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించినట్లు నివేదిక పేర్కొంది. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్ సిరీస్‌తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. అతడికి ఇది పునరాగమన సిరీస్ కావడంతో బోర్డు నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
బుమ్రా పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని రుతురాజ్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని అగార్కర్ కోరుకున్నట్లు నివేదికలో పేర్కొన్నప్పటికీ.. బుమ్రాకు నాయకత్వం వహించాలనే ఆసక్తి ఉండటంతో బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేసిందని కథనం తెలిపింది. ఇక అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత అతడి స్థానంలో ఎవరు రానున్నారనేది బీసీసీఐ ఇంకా చెప్పనప్పటికీ, భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇదీ చదవండి: లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టులో విధ్వంస వీరుడు!


