ఆస్తులు.. అప్పులూ ఉచితమే!! | Robert Kiyosaki says BEST ASSETS FREE rich speak language of money | Sakshi
Sakshi News home page

ఆస్తులు.. అప్పులూ ఉచితమే!!

Sep 24 2026 2:11 PM | Updated on Sep 24 2026 2:34 PM

Robert Kiyosaki says BEST ASSETS FREE rich speak language of money

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడిదారు రాబర్ట్ కియోసాకి మరోసారి డబ్బు సంపాదన, ఆర్థిక ఆలోచనా విధానంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో.. మనం ఉపయోగించే పదాలు, మన ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. “మీ అత్యుత్తమ ఆస్తులు ఉచితమే. దురదృష్టవశాత్తూ మీ అత్యంత చెత్త అప్పులు కూడా ఉచితమే” అంటూ తన పోస్టును ప్రారంభించారు.

తాను ఆదివారం జరిగే ధార్మిక పాఠశాలలో చదువుకునే సమయంలో “పదం శరీరరూపం దాల్చింది” అనే భావనను నేర్చుకున్నానని కియోసాకి తెలిపారు. తన ఉద్దేశంలో మనం మాట్లాడే మాటలే క్రమంగా మన వ్యక్తిత్వంగా మారతాయని వివరించారు. “నేను భరించలేను”, “ప్రయత్నిస్తాను”, “ధనవంతులు అత్యాశపరులు” వంటి మాటలను ఆర్థికంగా వెనుకబడినవారు ఉపయోగించే పదాలుగా కియోసాకి పేర్కొన్నారు. అందుకే డబ్బుకు సంబంధించిన భాషను నేర్చుకోవాలని సూచించారు.

తాను నాలుగో తరం జపాన్‌-అమెరికన్‌ అయినప్పటికీ జపనీస్‌ భాష మాట్లాడలేనని కియోసాకి చెప్పారు. కానీ ఒకవేళ తాను జపాన్‌లో నివసించాలన్నప్పుడు లేదా అక్కడ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ భాషను నేర్చుకుంటానన్నారు. అదే విధంగా ధనవంతుల ప్రపంచంలో డబ్బుకు సంబంధించిన భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఎర్న్‌డ్‌ ఇన్‌కమ్‌’, ‘పోర్ట్‌ఫోలియో ఇన్‌కమ్‌’, ‘పాసివ్‌ ఇన్‌కమ్‌’ అనే మూడు పదాల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని సూచించారు.

కియోసాకి అభిప్రాయం ప్రకారం, పేదవారు ప్రధానంగా ఉద్యోగం చేసి జీతం రూపంలో వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. దీన్నే ‘ఎర్న్‌డ్‌ ఇన్‌కమ్‌’గా ఆయన వివరించారు. పైగా ఇలాంటి ఆదాయంపైనే పన్నులు ఎక్కువగా ఉంటాయన్నారు. అదే మధ్యతరగతివాళ్లు ఉద్యోగంతో పాటు 401(k), IRA వంటి పదవీ విరమణ పెట్టుబడి పథకాల ద్వారా ‘పోర్ట్‌ఫోలియో ఇన్‌కమ్‌’పై దృష్టి పెడతారని తెలిపారు. ఇక ధనవంతులు తమ వద్ద ఉన్న ఆస్తుల నుంచి పనిచేయకుండానే ‘పాసివ్‌ ఇన్‌కమ్‌’ ఆర్జిస్తారని, దీనిపై పన్నులు కూడా తక్కువని రాసుకొచ్చారు.

‘పేద మాటలు మాట్లాడొద్దు.. డబ్బు భాష నేర్చుకోండి.. దీనికి ఖర్చు కూడా చేయనక్కరలేదు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలే మన ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తాయి’అని రాబర్ట్ కియోసాకి తనను అనుసరించేవారికి సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement