మూలధన ఆస్తి అంటే ఏమిటో, దాని నిర్వహణపై ఎలాంటి ట్యాక్స్‌లు ఉంటాయో మూలధన ఆస్తుల ‘బదిలీ’ లీలలులో తెలుసుకున్నాం. అయితే, ఈ అంశానికి సంబంధించి జాగ్రత్తలు.. తికమకకు దారి తీసే అంశాలున్నాయి. వీటిని ప్రాథమిక అంశాలని అనుకోండి. జాగ్రత్తగా తెలుసుకుని వ్యవహారం జరిపించాలని అనుకోండి.
1. స్వల్పకాలికమా/దీర్ఘకాలికమా
ఆస్తిని ఎప్పుడు కొన్నారు. ఎప్పుడు అమ్మారు. ఈ మధ్య వ్యవధిని ‘హోల్డింగ్ పీరియడ్’ అని అంటారు. ఈ పీరియడ్ అనేది ఆస్తిని బట్టి మారుతుంది. వ్యవధిని లెక్కించడంలో జాగ్రత్త వహించాలి. షేర్ల విషయంలో ఒక సంవత్సరం లోపు వ్యవధి, స్వల్పకాలికం అవుతుంది. అదే 1 సంవత్సరం దాటితే దీర్ఘకాలికం. స్వల్పకాలికమైతే ఒక రేటు, దీర్ఘకాలికం అయితే ఒక రేటు. స్థిరాస్తి విషయంలో ఈ హోల్డింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉండాలి.
2. ఇండెక్సింగ్ ఉందా.. లేదా..
ఇండెక్సింగ్ ఉందండి. చాలా మంది లేదనే అపోహలో ఉన్నారు. ఇండెక్సింగ్ తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ రేటు 20%. ఇదొక పద్ధతి. ఇండెక్సింగ్ తీసుకోకపోతే క్యాపిటల్ గెయిన్ 12.5%. రెండూ లెక్కించి, ఎక్కడ తక్కువ పన్ను భారమో తేల్చుకోండి.
3. ఈక్విటీ షేర్ల పన్ను భారం
స్వల్పకాలిక షేర్లు క్రయవిక్రయాల్లో జాగ్రత్త. ఒకప్పటి రేటు 15 శాతం. ప్రస్తుతం ఈ రేటు 20 శాతం. అకస్మాత్తుగా షేర్ల రేటు పతనం.. సంపద ఆవిరి. అంతలోనే రెట్టింపు లాభాలు. ఎంతో అనిశ్చితి. దీనికి తోడు ఈ పన్నుభారం. ఇందుకు సంబంధించిన మార్పులు గమనించాలి.
4. దీర్ఘకాలిక షేర్లకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ మీద మినహాయింపు రూ. 1,25,000 లేదా తక్కువైతే వచ్చినంత లాభం .. తక్కువ లాభం వచ్చినా రూ.1,25,000 మినహాయింపు ఉంటుందనుకుంటున్నారు. కొంత మంది ట్యాక్స్ ఫ్రీ అనుకుంటున్నారు. లాభం రూ. 1,50,000 అయితే మినహాయింపు రూ. 1,25,000. మిగతా రూ.25,000 మీద రేటు 12.5 శాతం.
5. బేసిక్ శ్లాబ్ .. షాకింగ్
రూ. 12,00,000ల లెక్కింపులో కొన్ని మూలధన లాభాలు ఉండవు. ఉదాహరణకు మీ జీతం రూ. 10,00,000 అనుకోండి. పన్ను భారం లేదు. బంగారం మీద స్వల్పకాలిక లాభం రూ. 3,00,000 అనుకోండి. షేర్లు కాని ఆస్తులను అంటే ఉదాహరణకు బంగారం అమ్మారు. పన్ను భారం పెరుగుతుంది. షేర్లు కాని వాటిని 24 నెలల హోల్డింగ్ పీరియడ్ అనంతరం లాంగ్ టర్మ్‌లో విక్రయించండి. స్వల్పకాలికంగా అమ్మకండి.
6. 87ఏ రిబేటు.. పోటు
ఇదొక కంటికి కనిపించని ట్రాప్. మీ జీతం రూ. 5,00,000 అనుకోండి. 87ఎ రిబేటు ఉంటుంది కాని దీర్ఘకాలిక ప్రాతిపదికన షేర్ల మీద అమ్మకంతో 4,00,000 లాభం వచి్చందనుకోండి.. మొత్తం ఆదాయం రూ. 9,00,000. చాలా మంది పన్ను భారం లేదని అనుకుంటారు. దీర్ఘకాలిక లాభాలను ప్రత్యేక పన్ను రేట్లతో లెక్కిస్తారు. రూ. 1,25,000 మినహాయింపు తర్వాత 12.5 శాతం పన్ను భారం పడుతుంది.
7. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి.. వెంటనే..
ఏ క్వార్టర్‌లో మూలధన లాభం ఏర్పడిందో ఆ క్వార్టర్‌లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. అలా కాకపోతే ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. పన్ను భారాన్ని పోస్ట్‌పోన్ చేయకండి.
8. రీఇన్వెస్ట్‌మెంట్‌కి గడువులు
రీఇన్వెస్ట్‌మెంట్ సకాలంలో చేయాలి. వివరాల్లోకి వెళ్లకుండా.. 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం ముందుకి.. 2 సంవత్సరాలు వెనక్కి.. బాండ్లలో వేయడం, క్యాపిటల్ గెయిన్ డిపాజిట్‌లో వేయడం..గడువులు గమనించాలి.
ఇదీ చదవండి: తండ్రి ఆస్తిలో వాటా ఎవరికి? కూతురికా? కొడుక్కా?
9. బాండ్లు ఒక సంవత్సరంలోనే డిపాజిట్
మీకు లాంగ్ టర్మ్ గెయిన్స్ రూ. 60,00,000 అనుకోండి. గడువు ప్రకారం 6 నెలలు ఉన్నప్పటికీ.. అంటే ఈ సంవత్సరంలో 3 నెలలు, వచ్చే సంవత్సరంలో 3 నెలలు అనుకుని రూ. 30,00,000 మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం రూ. 30,00,000 అనుకునేరు లేదా ఒక ఏడాది రూ. 50,00,000 మరో ఏడాది రూ. 10,00,000 అనుకునేరు. కానీ అది తప్పు. రూ. 50,00,000 పరిమితి ఒక సంవత్సరానికి కాదు. ఒక వ్యవహారానికి. ఇలా ఎన్నో చిక్కులు, మెలికలు, తికమకలు. అందుకే ఆలోచించండి. అవసరమైతే వృత్తి నిపుణులను సంప్రదించండి.


