భారతీయ కుటుంబాల్లో తండ్రికి చెందిన ఆస్తిలో కుమారుడు లేదా కుమార్తెకు చట్టబద్ధంగా ఎంతవరకు వాటా దక్కుతుందనే అంశంపై తరచూ సందేహాలు తలెత్తుతుంటాయి. కుటుంబ ఆస్తి వ్యవహారాల్లో వారసత్వ చట్టాలపై సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, తండ్రి ఆస్తిపై పిల్లల హక్కులు అనేది పూర్తిగా ఆ ఆస్తి స్వభావంపైనే ఆధారపడి ఉంటాయి.
పిత్రార్జిత ఆస్తి
నాలుగు తరాలుగా విభజించబడకుండా వస్తున్న పిత్రార్జిత ఆస్తి (యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ) విషయానికి వస్తే సంతానానికి పుట్టుకతోనే అందులో హక్కు లభిస్తుంది. 2005 హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం, పిత్రార్జిత ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా సమానమైన హక్కులను కల్పించారు. తండ్రి జీవించి ఉన్న సమయంలోనే పిల్లలు ఈ ఆస్తిలో తమ చట్టబద్ధమైన వాటాను కోరే అధికారం కూడా కలిగి ఉంటారు.
సొంత సంపాదనతో ఆస్తి ఉంటే..
మరోవైపు, తండ్రి తన సొంత సంపాదనతో కొనుగోలు చేసిన స్వార్జిత ఆస్తి (సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ) విషయంలో నిబంధనలు పూర్తిగా వేరుగా ఉంటాయి. తండ్రి జీవించి ఉన్నంతవరకు ఈ ఆస్తిపై ఆయనకే సర్వాధికారాలు ఉంటాయి. తన ఇష్టానుసారం ఈ ఆస్తిని ఎవరికైనా విక్రయించడానికి, బహుమతిగా ఇవ్వడానికి లేదా విల్లు ద్వారా రాసి ఇవ్వడానికి ఆయనకు పూర్తి స్వతంత్రత ఉంటుంది. తండ్రి జీవించి ఉండగా పిల్లలు ఈ ఆస్తిలో వాటా కావాలని న్యాయపరంగా కోరలేరు.
తండ్రి మరణిస్తే..
అయితే, తండ్రి ఎటువంటి విల్లు రాయకుండా మరణిస్తే ఆయన స్వార్జిత ఆస్తి క్లాస్-1 చట్టబద్ధ వారసులైన భార్య, కుమారులు, కుమార్తెలకు సమానంగా పంపిణీ అవుతుంది. కుటుంబాల్లో ఆస్తి వివాదాలు తలెత్తకుండా ఉండటానికి ఆస్తి స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా చట్టబద్ధమైన విల్లు లేదా విభజన పత్రాలను సిద్ధం చేసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?


