కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులకు బాటలు వేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. 2014 తర్వాత దాదాపు 12 ఏళ్లకు ఈ పరిమితి పెరగడంతో వేతనజీవుల్లో ఒకవైపు పొదుపు పెరుగుతుందనే ఆనందం ఉన్నప్పటికీ నెలవారీ చేతికి వచ్చే జీతం తగ్గుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
సగటు ఉద్యోగి వేతనంపై ప్రభావం ఎంతంటే..
ఉద్యోగి కనీస వేతనం (బేసిక్‌పే+డియర్‌నెస్ అలవెన్స్) ఆధారంగా 12 శాతానికి తగ్గకుండా పీఎఫ్ మినహాయింపు ఉంటుంది.
పాత నిబంధన (రూ.15,000 సీలింగ్): ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ చట్టబద్ధంగా గరిష్టంగా రూ.15,000 పరిమితి పైనే పీఎఫ్‌ను పరిగణించేవారు. దాంతో ఉద్యోగి వాటా నెలకు రూ.1,800 (12%) మాత్రమే కట్ అయ్యేది.
కొత్త నిబంధన (రూ.25,000 సీలింగ్): ఇప్పుడు రూ.25,000 సీలింగ్ వర్తించడం వల్ల పూర్తి ప్రాథమిక వేతనం రూ.25,000 పై 12% లెక్కించి రూ.3,000 పీఎఫ్ వాటాగా జమ చేయాల్సి ఉంటుంది.
ప్రధాన ప్రభావాలు.. ఉద్యోగికి కలిగే ప్రయోజనాలు
తక్షణ నెట్ పే తగ్గింపు: ఫిక్స్డ్ సీటీసీ విధానం అనుసరించే కంపెనీల్లో పని చేసే సగటు ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.1,200 వరకు చేతికి వచ్చే నికర జీతం తగ్గుతుంది. ఇది స్వల్పకాలికంగా గృహ బడ్జెట్ లేదా ఈఎంఐ చెల్లింపులపై కొద్దిపాటి ఒత్తిడి తేవచ్చు.
భారీ ప్రావిడెంట్ ఫండ్ నిధి: ఉద్యోగి వాటా రూ.1,800 నుంచి రూ.3,000 కి పెరగడం, అదే సమయంలో యజమాని వాటా కూడా పెరగడం వల్ల ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో రూ.3,600 కి(రూ.1800+రూ.1800) బదులుగా రూ.6,000 జమ అవుతుంది. చక్రవడ్డీ ప్రభావంతో 20-25 ఏళ్ల పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో అదనంగా లక్షల రూపాయిల కార్పస్ నిధి సమకూరుతుంది.
పెన్షన్ (ఈపీఎస్), బీమా (ఈడీఎల్‌ఐ) సౌకర్యాల పెంపు: ప్రిన్సిపల్ సీలింగ్ పెరగడం ద్వారా ఉద్యోగుల పెన్షన్ నిధి (ఈపీఎస్) మినహాయింపు రూ.1,249.50 నుంచి రూ.2,082.50కి పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత లభించే నెలవారీ పెన్షన్ పరిమాణం కూడా పెరుగుతుంది.
పన్ను ప్రయోజనం: ఉద్యోగి మినహాయించే అదనపు పీఎఫ్ మొత్తానికి పాత పన్ను విధానం కింద సెక్షన్ 80సీ పరిధిలో పన్ను మినహాయింపు లభిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవస్థీకృత రంగానికి చెందిన ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేస్తుందని కొందరు చెబుతున్నారు. స్వల్పకాలంలో చేతికి వచ్చే జీతంలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, పదవీ విరమణ సమయానికి ఆర్థికంగా స్థిరపడటానికి ఇది అవకాశంగా పరిణమిస్తుందంటున్నారు.
ఇదీ చదవండి: టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్


