బీజింగ్: చైనాకు చెందిన 75 ఏళ్ల మహిళ తన పదవీ విరమణతో వచ్చిన పొదుపు మొత్తాన్ని అందాల చికిత్సల కోసం ఖర్చు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒకే సంస్థకు చెందిన బ్యూటీ సెలూన్లు, మెడికల్ బ్యూటీ క్లినిక్‌లలో రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వెల్లడించింది. తన తల్లి పొదుపు దాదాపు పూర్తిగా ఖర్చయిన విషయం తెలుసుకున్న కుమార్తె షాక్‌కు గురయ్యారు. ‘యూ’ అనే ఆ మహిళ 2016 నుంచి యోంగ్‌కి బ్యూటీ అండ్ హెయిర్‌డ్రెస్సింగ్ కంపెనీకి చెందిన ఓ శాఖను, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ బ్యూటీ క్లినిక్‌కు వెళుతున్నారు
చర్మాన్ని బిగుతుగా మార్చే చికిత్సలు, థ్రెడ్ లిఫ్టింగ్, మెరిడియన్ మసాజ్‌లు, కనుబొమ్మలకు టాటూ, పెదవులకు టాటూ తదితర సేవలు అందుకున్నారు. కొన్ని చికిత్సలకు సాధారణ ధరల కంటే అధిక మొత్తాలు వసూలు చేసినట్లు బిల్లుల్లో ఉన్నట్లు కుమార్తె గుర్తించారు. పెదవుల టాటూ ప్యాకేజీకి 39,800 యువాన్లు (సుమారు రూ.5.6 లక్షలు) చెల్లించినట్లు రికార్డుల్లో ఉంది. సాధారణంగా తరచూ చేయాల్సిన అవసరం లేని కొన్ని చికిత్సలను కూడా పదేపదే చేయించుకున్నట్లు తెలుస్తోంది.
తన వద్ద ఆర్థికంగా సరిపడా డబ్బు ఉందని భావించడంతో ఖర్చులను పెద్దగా పరిశీలించలేదని ‘యూ’ తెలిపారు. ఆమె పొదుపులో ఎక్కువ భాగం ఇంటిని విక్రయించడం ద్వారా వచ్చినదే. చివరకు అద్దె ఇల్లు తీసుకునే స్థోమత కూడా లేకపోవడంతో, నగలను సైతం విక్రయించాల్సి వచ్చింది. దీనికితోడు ‘ఇంటిమేట్ కేర్’ పేరుతో ఓ ప్రక్రియకు 3 లక్షల యువాన్లు (సుమారు రూ.42 లక్షలు) చెల్లించారు. కొన్ని బిల్లుల్లో ‘హ్యాపీనెస్ చైర్’, ‘స్పేస్ క్యాప్సూల్’ వంటి అసాధారణ సేవల పేర్లు కూడా ఉన్నట్లు కుమార్తె తెలిపారు. ఈ ఘటనపై ఆన్‌లైన్‌లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: నేపాల్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు


