మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి
మహిళా న్యాయవాది ఇంట్లో వృద్ధురాలి హత్య
సుత్తితో కొట్టి చంపిన లాయర్ కుటుంబీకులు
రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి స్వాధీనం
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికెట్ నోటరీ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈనెల 17న జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు.. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలు చింతు చిన్నమ్మడు (74) ఒంటినిండా బంగారం ధరించి ఈనెల 17న నరసన్నపేటలోని మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్లింది.
ఆమె నుంచి బంగారం దోచుకోవాలనే అత్యా శతో ధనలక్ష్మి తన సోదరుడు బెండి అచ్యుతరావు (స్టాంపు వెండర్), పెద్ద కుమారుడు గణేష్ (న్యాయవాది)తో కలిసి హత్యకు పథకరచన చేసింది. వృద్ధురాలిని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి సుత్తితో తలపై మోది చంపేసిన అనం తరం మరో ఇద్దరి సాయంతో శవాన్ని గోనె సంచిలో పెట్టి అద్దె కారులో హిర మండలం పిండ్రువాడ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి తంపర కాలువలో పడేశారు. ధనలక్ష్మి రెండో కుమారుడు మణికంఠ (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), అచ్యుతరావు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు.
ఘాతుకం బయటపడిందిలా
హతురాలు చిన్నమ్మడు కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఈనెల 11న స్వగ్రామైన అల్లాడపేటకు వచ్చిన ఆమె 17న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామంలో బంధువుల ఇంట్లో పెళ్లి రాటవేసే కార్యక్రమం ఉండటంతో నగలు ధరించి వెళ్లిందని, ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫి కెట్ నిమిత్తం నోటరీ చేసేందుకు ఈ ఏడాది మేలో పరిచయమైన న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్తానని కుటుంబీకులకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దిశగా జలుమూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఈ నెల 17న ఉదయం 11.30 గంటలకు నరసన్నపేట పోలీస్‌స్టేషన్ మీదుగా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ సమీపంలోనే ఉన్న న్యాయవాది ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది.
ఆ ఫుటేజీలో వృద్ధురాలు తిరిగి రావడం కనిపించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో న్యాయవాది ఇంటికి ఓ కారు వచ్చింది. సీడీఆర్ విశ్లేషణతో పాటు డాగ్‌స్కా్వడ్ బృందంతో తనిఖీలు చేయగా న్యాయవాది ఇంటి పరిసరాల్లోనే తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. కారు ట్రాకింగ్ హిస్టరీ బట్టి పోలీసులు నిందితులను విచారించగా హత్యోదంతం బయటపడింది. న్యాయవాదులు కావడంతో చేసిన నేరాలనుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచించి కారును కెమికల్ లిక్విడ్‌తో శుభ్రపరిచారు. రక్తపు ఆధారాలు, ఇతర కీలకమైనవి చెరిపేశారు.
ఆ న్యాయవాది జంట హత్యల కేసులో నిందితురాలు
నిందితుల్లో ఒకరైన ధనలక్ష్మి 2008లో జరిగిన జంట హత్యల కేసులో నిందితురాలని, అప్పుడు కూడా బంగారం కోసం హత్య చేశారని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


