‘గూడు’జారి ఓటు గల్లంతు! | Demand for clarity on the rehabilitation of the Veligonda project | Sakshi
Sakshi News home page

‘గూడు’జారి ఓటు గల్లంతు!

Aug 27 2026 5:04 AM | Updated on Aug 27 2026 5:04 AM

Demand for clarity on the rehabilitation of the Veligonda project

వెలిగొండ నిర్వాసితుల ఆందోళన

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తమ ఓట్లు ఎక్కడ నమోదవుతాయని ప్రశ్న 

ప్రాజెక్టు పరిధిలో 7,270 నిర్వాసిత కుటుంబాలు

ఓటర్లు సుమారు 22 వేల నుంచి 24 వేలు

ఇప్పటికే సర్‌ కార్యక్రమం ద్వారా పరిశీలనలు 

పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలతో సర్కారు ఆటలాడుతోంది. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండా ఊళ్ల నుంచి గెంటేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీల్లోనూ ఇంటి నిర్మాణాలు జరగకపోవడం, కనీస వసతులు లేకపోవడంతో నిర్వాసితులు అద్దె ఇళ్ల కోసం వెతుకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులకు కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ ఓటు హక్కు ఎక్కడ ఉంటుందని నిర్వాసితులు సర్కారును నిలదీస్తున్నారు. 

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో మార్కాపురం జిల్లాలోని గొట్టిపడియ, సుంకేసుల, అక్కచెరువు, గుండంచర్ల, కలనూతల, కాటంరాజు తండా, సాయిరాం నగర్, చింతలముడిపి, రామలింగేశ్వరపురం, కృష్ణానగర్, లక్ష్మీపురం తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో 7,270 మంది నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. వారిలో ఓటర్లు సుమారు 22 వేల నుంచి 24 వేల వరకు ఉన్నారు. ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకోవడంతో అధికారులు గ్రామాలను ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు. 

పునరావాస కాలనీల్లో సౌకర్యాలు లేకపోవడం ఇంటి నిర్మాణాలు జరగకపోవడంతో నిర్వాసితులందరూ మార్కాపురం పట్టణం, రూరల్, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో ఎక్కడ అద్దె ఇల్లు దొరికితే అక్కడ చేరిపోతున్నారు. ఇళ్ల కొరతతో నెలకు రూ.7 వేలు ఉన్న అద్దె ఇల్లు ప్రస్తుతం రూ.10 వేలు చెబుతున్నారని లబోదిబోమంటున్నారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు దొరక్క సతమతమవుతున్నాయి. దీంతో కొందరు బంధువుల ఇళ్లలో, మరికొందరు సమీప గ్రామాల్లో తాత్కాలికంగా ఉంటున్నారు. 

ఎలా బత‘కాలనీ’!
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీల్లో అన్ని కుటుంబాలు వెంటనే నివసించే పరిస్థితి లేదని నిర్వాసితులు చెబుతున్నారు. మౌలిక వసతులు, ఇళ్ల నిర్మాణం, రహదారులు, తాగునీరు, విద్యుత్‌ తదితర అంశాలపై చాలా సమస్యలు ఉన్నాయని గగ్గోలుపెడుతున్నారు. దీంతో సొంత గ్రామాల్లో ఉండలేక.. పునరావాస కేంద్రాలకు వెళ్లలేక.. పట్టణాల్లో అద్దె ఇళ్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓట్లు ఉంటాయా? పోతాయా? 
ఈ నేపథ్యంలో సొంత గ్రామాలు ఖాళీ చేస్తే అక్కడి ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయా? పునరావాస కాలనీలకు తరలిస్తే అక్కడ ఓటు హక్కు కల్పిస్తారా? పట్టణాలు, ఇతర గ్రామాల్లో అద్దెకు ఉంటున్న వారికి ఓటు ఎక్కడ ఉంటుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటు హక్కు విషయంలో స్పష్టత లేకపోతే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని, పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement