ఘోర రోడ్డు ప్రమాదం | A serious road accident occurred near Kodad in Suryapet district of Telangana | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Aug 27 2026 4:31 AM | Updated on Aug 27 2026 12:12 PM

A serious road accident occurred near Kodad in Suryapet district of Telangana

ఆరుగురు దుర్మరణం 

15 మందికి తీవ్ర గాయాలు 

ప్రమాదానికి గురైన ట్రాలీ లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు  

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో దుర్ఘటన 

మృతులందరిదీ ఉమ్మడి కృష్ణా జిల్లా 

మృతులలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు 

వారిలో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు  

కోదాడ, కోదాడ రూరల్‌/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మరో­సారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమా­దం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్‌పై ఆగి­పోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌డ్రైవర్‌  వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణి­స్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక­క్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విష­మంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు (టీఎస్‌ 08­యుఎల్‌ 5112) 42 మంది ప్రయా­ణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి ఏలూ­రుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్‌ స్టేషన్‌ వద్ద ఆపి బస్సు చార్జింగ్‌ పెట్టుకు­న్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్‌ డ్యూటీ దిగి రెండో డ్రైవర్‌కు బస్సు అప్పగించాడు. హైద­రాబాద్‌ నుంచి విజయ­వాడవైపు ఐరన్‌ పిల్లర్లలోడ్‌తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధ­వారం తెల్లవారు­జామున 4 గంటలకు కోదాడ శివా­రులో అదుపుతప్పి డివైడర్‌పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్‌ ట్రాలీ లారీని గమనించకుండా వెనుక­వైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. 

ఈ ప్రమాదంలో ట్రాలీ లారీ­లో ఉన్న ఐరన్‌ పిల్లర్లు బస్సులోకి చొచ్చు­కురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్‌ సీటు వెనుక సీట్ల­లో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా­(24), చెన్నకేశ­వుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్‌ ఇన్‌చార్జ్‌ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..
కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్‌తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్‌మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్‌పై ఉన్నాయి. లారీ డ్రైవర్‌ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది.  ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.

ఆ బస్సు డ్రైవర్‌ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్‌ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

మృతుల్లో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే..
మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇంట­ర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.

క్షతగాత్రుల వివరాలు
» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్‌కు చెందిన రాథోడ్‌ విశాల్‌లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్‌ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.

» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి  తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. 

» విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్‌కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ,  ఆకుల నవీన్‌కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్‌కుమార్‌ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్‌ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్‌కు చెందిన జి.అవినాష్‌ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.

తీవ్ర విషాదకరం 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాద­కరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. 

అవస­రమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణా­లను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement