రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే 14 శాతం లోటు
ఇప్పటివరకు కురవాల్సిన వాన 53.78సెం.మీ.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక వర్షాలు
16 జిల్లాల్లో సాధారణం, 15 జిల్లాల్లో లోటు వర్షాలు
వచ్చేనెల తొలి వారం వరకు అత్తెసరు వర్షాలే
అక్కడక్కడా తేలికపాటి వానలకు అవకాశం: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ మూడో వంతు ముగుస్తున్నా వర్షాలు మాత్రం ఆశాజనకంగా కురవడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా అంచనాలు విడుదల చేసింది. ఈక్రమంలో సీజన్ మొదట్నుంచీ రాష్ట్రంలో అత్తెసరు వర్షాలే కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు 53.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం కురవా ల్సి ఉండగా ఇప్పటివరకు 46. 47 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే 14 శాతం లోటు వర్షపాతం ఉంది. సీజన్‌లో ఇప్పటివరకు భారీ వర్షాలు నమోదు కా లేదు. రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నప్పటికీ వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంలేదని నిపుణులు చెబుతున్నారు.
15 జిల్లాల్లో లోటు...: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే నమోదయ్యాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఇప్పటివరకు 15 జిల్లాల్లో 20 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం నమోదైంది. మరో 16 జిల్లాల్లో వర్షపాతం సాధారణమని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇందులోనూ చాలా జిల్లాల్లో 10 నుంచి 15శాతం లోటు ఉన్న జిల్లాలు ఆరు జిల్లాలున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం తీరును పరిశీలిస్తే... కేవలం రెండు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదైంది. 73 మండలాల్లో అధిక వర్షపాతం, 269 మండలాల్లో సాధారణ వర్షపాతం, 273 మండలాల్లో లోటు వర్షపాతం, నాలుగు మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది.
జిల్లాల వారీగా వర్షపాతం తీరు...
లోటు: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట్, ఖమ్మం, నారాయణపేట.
సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు
అధికం: కామారెడ్డి, మెదక్
మరో పదిరోజులు అంతంతే...
రాష్ట్రంలో వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, ఈ నెల రెండో వారం నుంచి ఇప్పటివరకు వర్షాలు అత్యంత పరిమితంగానే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షానికి అనుకూల వాతావరణం ఏర్పడడం లేదని, రుతుపవనాలు విరామదశలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. రానున్న పది రోజుల వరకు వర్షాలు తక్కువగా నమోదవుతాయని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్‌లో బంగాళాఖాతంలో ఒకటి రెండు బలమైన అల్పపీడనాలు ఏర్పడితే పరిస్థితి పూర్తిగా మారవచ్చని, సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ/వాయవ్య దిశలో కదిలితే రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు.


