పెరోల్‌.. 40 ఏళ్లు పరార్‌ | High Court expresses anger over authorities failure to arrest prisoner | Sakshi
Sakshi News home page

పెరోల్‌.. 40 ఏళ్లు పరార్‌

Aug 27 2026 4:25 AM | Updated on Aug 27 2026 2:09 AM

High Court expresses anger over authorities failure to arrest prisoner

హత్య కేసులో జీవిత ఖైదీ బాగోతం

పేరు మార్చుకుని ఉద్యోగం.. ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు.. చివరకు అరెస్టు 

2013లో పదవీ విరమణ.. 2024లో అరెస్టు... 

పెరోల్‌పై బయటకు వచ్చి.. పెన్షన్‌ తీసుకునే వరకు... 

నాలుగు దశాబ్దాలు పోలీసులకు చిక్కని జీవిత ఖైదీ వీరన్న కథ 

ఖైదీని పట్టుకోవడంలో అధికారుల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి, హైదరాబాద్‌: ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్‌పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు.. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖైదీ నంబర్‌ 1567 వీరన్న కథ 1982లో మహబూబాబాద్‌లో ఓ పాన్‌షాప్‌ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్‌ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, అల్లర్ల కేసులో సందెల వీరన్న నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వరంగల్‌ అదనపు జిల్లా కోర్టు 1983 జూన్‌ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్‌ సెంట్రల్‌ జైలులో (ఖైదీ నంబర్‌ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్‌ 17న 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం పెరోల్‌ను 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల ‘పరారీ జీవితం’. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ అతడిని పట్టుకుంది. అనంతరం వరంగల్‌ సెంట్రల్‌ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

పేరు మార్చుకుని ప్రభుత్వ టీచర్‌గా..   
ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించినట్లు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు. 2013లో పదవీ విరమణ చేశాడు. పెన్షన్‌ పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు కూడా అందుకున్నట్లు పిటిషనర్‌ తరఫు వాదనలో నమోదైంది. 2013 నుంచి మహబూబాబాద్‌ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టుకోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయత్నాలు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2012 నవంబర్‌ 19 నుంచి 2020 అక్టోబర్‌ 3 వరకు మహబూబాబాద్, వరంగల్‌ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని పేర్కొంది. ఎట్టకేలకు ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను నియమించి అరెస్టు చేసినట్లు తెలిపింది. 

మళ్లీ పెరోల్‌ కోరిన భార్య.. తిరస్కరించిన హైకోర్టు 
వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్‌ రద్దు, మూడేళ్ల పాటు పెరోల్, ఫర్లో తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్‌పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్‌పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందడం ఆశ్చర్యకరమంది. ఇది జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల తీరును తెలియజేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

పెరోల్‌ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా లేదా పరిశీలించడం, హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. మూడేళ్లపాటు పెరోల్‌–ఫర్లో (మంచితనంపై బయటకు వెళ్లేందుకు ఇచ్చే అనుమతి) నిరాకరణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. జీవితంలోని అత్యంత ముఖ్యమైన కాలాన్ని ఖైదీ జైలు వెలుపల గడిపాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. జైలు శిక్ష నుంచి తప్పించుకుని, ఆ సమయంలో సాధారణ జీవితంలోని ప్రయోజనాలను పొందాడరన్నారు. కానీ అతడిపై విధించిన జీవిత ఖైదు శిక్ష ఇప్పటికీ రద్దు కాలేదని.. ఉద్దేశపూర్వంగా శిక్ష తప్పించుకున్నట్లు అవగతమవుతోందన్నారు. మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement