సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారగా, అధిష్టానం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా కొండా సురేఖ భర్త కొండా మురళి రంగంలోకి దిగి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కీలక నేతలను ప్రత్యేకంగా కలిశారు.
ఈ భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా కొండా సుష్మిత వ్యాఖ్యలపై స్పందించారు. ‘కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, సుష్మితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మేం క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సిన వివరణ ఇచ్చాం. అధికారిక పనుల్లో భాగంగానే బిల్లుల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశాం’
‘కొండా సుస్మిత నా బిడ్డ. ప్లాన్-ఏలో ఆమె అలా మాట్లాడింది. ప్లాన్-బీలో ఏం చేస్తుంది అంటే నాకేం తెలుస్తుంది? ఆ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివాదం నా బిడ్డది. అందులో ప్లాన్-బీలో ఏముందో నాకు తెలియదు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ క్రమశిక్షణా కమిటీకి తాము చెప్పాల్సిన వివరణ స్పష్టంగా ఇచ్చామని, అధికారిక పనుల్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ క్రమశిక్షణా రాహిత్యంగా భావించడంతో పాటు, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
వివాదం ముదరకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన కొండా మురళితో పాటు, ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,ఇటీవల ప్రభుత్వంపై అసంతృప్తి స్వరం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు వివాదాన్ని సర్దుమణిగేలా చేస్తాయా, లేక పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి.
👉ఇదీ చదవండి: నా కుమార్తె మాటలకు నాకేం సంబంధం


