సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మంత్రుల సంతాపం
సూర్యాపేట బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పోస్టుమార్టం కోసం రెండు బృందాల ఏర్పాటు చేయాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అప్పగించాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలిపారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
చదవండి: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
ఘటనా స్థలంలో కలెక్టర్
కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పరామర్శించారు.
డ్రైవర్ మారిన మరుక్షణమే..
తాను డ్యూటీ మారిన తర్వాతనే ప్రమాదం జరిగిందని రెండో డ్రైవర్ మీడియాతో చెప్పారు. సూర్యాపేటలో తాను డ్రైవింగ్‌ను మరో డ్రైవర్‌కు అప్పగించి, పడుకున్నానని వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం సంభవించిందని తెలిపారు. బస్సులో 42 మంది ఉన్నారని చెప్పారు.
కొద్దిలో బతికిపోయా
వెనుక సీటులో కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డానని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాఖీ పండుగ కోసం చెల్లెలు దగ్గరికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. ఇనుప రాడ్ తన ముఖం వరకు వచ్చి ఆగడంతో బతికిపోయానని వెల్లడించారు. బస్సు సూర్యాపేటలో ఆగి.. మళ్లీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు.


