రేవంత్‌ టూర్‌కు ‘నో’ పర్మిషన్‌.. కేంద్రం మరో కోణం ఇదేనా? | KSR Comments On Revanth Reddy US Tour Cancellation, Growing Political Challenges And Internal Congress Differences | Sakshi
Sakshi News home page

రేవంత్‌ టూర్‌కు ‘నో’ పర్మిషన్‌.. కేంద్రం మరో కోణం ఇదేనా?

Aug 26 2026 9:54 AM | Updated on Aug 26 2026 11:05 AM

KSR Comments On CM Revanth Reddy Tour Cancel

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమేపీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారనిపిస్తుంది. వీటిలో అత్యధికం ఆయన స్వయంగా సృష్టించుకున్నవేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పడం, మద్యలోనే యూకే నుంచే వెనక్కి రావల్సిన పరిస్థితి ఏర్పడడం,కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు పెరగడం,మంత్రి  కొండా సురేఖ కుమార్తె ఏకంగా ఆయనపైనే తీవ్ర ఆరోపణలు సంధించడం,  తదితర అంశాలు చికాకుగా తయారయ్యాయి. రేవంత్ యూకే, అమెరికాలోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటిని తెలంగాణకు తీసుకురావలన్న ఉద్దేశంతో ఈ యాత్ర పెట్టుకున్నారు. అంతవరకు సంకల్పం మంచిదే. కాని ఈ టూర్ లో ఆయన పెట్టుకున్న మరి కొన్ని ప్రోగ్రాంలు ఇబ్బందిలో పడేశాయి.

భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్  ఏకంగా రేవంత్ టూర్ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయంటూ ఆరోపణ చేశారు. ఆ మరుసటి రోజే కేంద్రం రేవంత్ టూర్‌ను అడ్డుకుంది. సీఎం టూర్ షెడ్యూల్ లో స్పష్టత లేదన్నది ఒక వివరణ అయితే, ముఖ్యమంత్రి హోదా తో సంబందం లేకుండా,రెండు దేశాల సంబందాలపై ప్రభావం  పడే అవకాశం ఉండే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించారన్నది కేంద్రం వాదనగా ఉంది. అందుకే రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీనికి ముందు రేవంత్ వివరణ తీసుకుని అనుమతికి నో చెప్పి ఉంటే ఎలా ఉండేదో. 

కేంద్రం ఏకపక్షంగా అనుమతి నిరాకరించడంతో ఇది బీజేపీ, కాంగ్రెస్ ల మద్య వివాదంగా మారింది. కావాలని రేవంత్ టూర్‌ను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే  ఆరోపించి ఆక్షేపణ తెలిపారు. రేవంత్ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు విమర్శించారు. తనకు అనుమతి నిరాకరించడం  తెలంగాణను అవమానించడమేనని రేవంత్ ఆరోపించారు.  కాని బీజేపీ తెలంగాణ  అద్యక్షుడు ఎన్.రమాచంద్రరావు మాత్రం ఆ ఆరోపణలను ఖండించి, ఇందులో రాజకీయం ఏమీ లేదని పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.  ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనాలని రేవంత్ భావించారన్నది ఒక కారణంగా అనుమతి రాలేదని కొందరు చెబుతున్నారు.

కాని దీనికన్నా రేవంత్ అమెరికాలో అత్యున్నత పదవులలో ఉన్నవారిని కలసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా కారణమని అంటున్నారు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  అధికారులను కాంటాక్ట్ చేయడానికి రేవంత్  తరపున  ప్రయత్నాలు జరిగినట్లు అనిపిస్తుంది. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అమెరికా కాన్సలేట్ ఉన్న హైదరాబాద్ నానక్ రామ్ గూడకు ట్రంప్ అవెన్యూ అని రేవంత్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఆ విషయం ట్రంప్ దృష్టికి వెళ్లింది.  దానికి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అదే టైమ్‌ లో ట్రంప్ కంపెనీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ టవర్స్ నిర్మాణం చేయడానికి సన్నద్దం అయింది. దాంతో రేవంత్ ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చింది. వీలైతే ట్రంప్ ను కలవాలని ఆలోచించింది. లేదా ఉపాధ్యక్షుడు  జెడి వాన్స్ ను అయినా కలిసే అవకాశాలపై ట్రై చేశారట.

ఈ విషయాలన్ని కేంద్రానికి కూడా తెలిశాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేశ అధ్యక్షుడిని అధికారికంగా కలవడం సాధారణంగా జరగదు. ఈ నేపధ్యంలోనే కేంద్రం అనుమతి తిరస్కరించిందన్నది బీజేపీ వర్గాల కధనం.ఫలితంగా  రేవంత్ వెనక్కి తిరిగి రాక తప్పలేదు.కాకపోతే యు.కె.లో కొన్ని యూనివర్శిటీలతో సమావేశం అయి సంప్రదింపులు చేశారు. అమెరికాకు తన అదికారులను మాత్రం పంపించారు. లండన్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యారట.ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.అయితే  అమెరికా టూర్ కు సంబందించి రేవంత్ బృందం  ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం కూడా సరైనది కాకపోవచ్చు.

ఇక  కాంగ్రెస్ లో కీచులాటలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ పైన,ఆయన సోదరుడిపైన తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది.  దానిపై కాంగ్రెస్ కూడా సీరియస్ గా స్పందించింది.కుమార్తె వ్యాఖ్యలకుగాను సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తనకు ఆ వ్యాఖ్యలతో సంబందం లేదని ఆమె వివరణ ఇచ్చినా కమిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసు ఇవ్వగా, సురేఖ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇదంతా ఎవరో వెనుక ఉన్న అదృశ్యశక్తులు చేయిస్తున్న పని ఆమె ఆరోపించారు. పైగా కొన్ని బీసీ సంఘాలు సురేఖకు బాసటగా నిలవడానికి సిద్దం అయ్యాయి.  

పరకాల నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని రేవంత్ ప్రకటన చేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. సాదారణంగా అభ్యర్దుల ఎంపిక అన్నది హైకమాండ్ అంశంగా చెప్పుకుంటారు. రేవంత్ అనవసర ప్రస్తావన చేయడం ద్వారా ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నట్లయింది. 1989-94 మధ్య కూడా మూడు గ్రూపులు కాంగ్రెస్ లో ఉండేవి. అప్పటి ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు ప్రెస్ కాన్ఫరెన్స్  లు పెట్టి మాట్లాడేవారు. వాటిపై ప్రజలలో అసహనం కలిగేది. ఇప్పుడు దాదాపు అదే రీతిలో సురేఖకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మ్యేలు రేవంత్ వైపు మొహరించడం విశేషం. అయితే, 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారనుకుటే 17 మందే వచ్చారని బీఆర్ఎస్‌, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. కారణం ఏమైనా రేవంత్ కూడా ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సలహా ఇచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిందని చెప్పాలి. 

నిర్ణయం హై కమాండ్‌కు వదలివేయడంతో సురేఖ ఇష్యూ పెండింగులో పడినట్లయింది.ఇది కూడా రేవంత్ కు కాస్త అసహనం మిగిల్చేదే.  మరో వైపు సీనియర్ నేత చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేయడం, చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్ లో ధర్నా చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక మరో సీనియర్ నేత ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏకంగా అసలు కాంగ్రెస్ వారికి నష్టం జరుగుతోందన్నట్లుగా మాట్లాడడం సంచలనం రేకెత్తించింది. అయితే ఆయన కూడా మద్యలో కొంతకాలం బీజేపీలోకి వెళ్లివచ్చారు. 

రేవంత్ టీడీపీ నుంచి వచ్చి  ముఖ్యమంత్రి పదవి పొందడాన్ని ఎప్పటి నుంచో  కాంగ్రెస్‌ లో  ఉన్న పలువురు  నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తగినట్లే రేవంత్ కూడా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన  వారినే ఎక్కువగా నమ్ముతున్నారన్నది వీరి భావన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.  అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటనను  కొందరు ఉదహరిస్తున్నారు. ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనని రమేష్ కుమారుడు సంజోష్ కారు రాష్ డ్రైవ్ వల్ల ఒక యువతి మరణించింది. 

ఆ కేసులో సంజోష్‌ని రక్షించడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణ గుప్పుమంది. జాతీయ మీడియాలో  సైతం రేవంత్‌కు ,చంద్రబాబుకు మద్య హాట్ లైన్ నడుస్తుంటుందని, అందువల్లే ఎంపీ కుమారుడిని అరెస్టు  చేయలేదని కధనాలు,వ్యాఖ్యలు వచ్చాయి. అయితే  కాంగ్రెస్  అధిష్టానం బలహీనంగా ఉన్న నేపధ్యంలో రేవంత్ కు ఈ పరిణామాలేవీ ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టకపోవచ్చు.  కాని 2028 ఎన్నికల నాటికి రాజకీయ అంశాలతో  పాటు ప్రభుత్వపరంగా 22 ఎ, తదితర సమస్యలు  ఏ రూపు దాల్చుతాయో అన్న ఆందోళన పార్టీలో ఉంటుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement