నాలుగు రోజులపాటు నిర్వహణ: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇందిరమ్మ టవర్లలోని గృహాల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక కోసం 28 నుంచి 31వ తేదీ వరకు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాలకు సంబంధించి అందిన 60,720 దరఖాస్తుల్లో సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించినట్టు వెల్లడించారు.
అనర్హుల దరఖాస్తులను ఎందుకు తిరస్కరించామో కారణాలతో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లక్కీ డ్రాలను స్థానిక ఫంక్షన్‌హాళ్లలో నిర్వహిస్తామని, ఒక్కో కేంద్రానికి ఒక్కో ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించామని తెలిపారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. పది వేల ఈఎండీ మొత్తాన్ని వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామని స్పష్టం చేశారు.
మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థలాల ఎంపిక..
28వ తేదీన రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి, రెడ్ హిల్స్, 29న కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపుర, 30న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిష్ పల్లి, బండ్లగూడ (ఎల్‌ఐజీ కాలనీ), నందిముస్లాయిగూడ, 31న గాజులరామారం, అంబర్ పేటలోని సిటీపోలీస్ లైన్స్, గడ్డిఅన్నారం, ఆర్–బి క్వార్టర్స్,పోచారం (ఎల్‌ఐజీ కాలనీ)లో లక్కీడ్రా నిర్వహిస్తారని తెలిపారు. క్యూర్ పరిధిలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో హయత్‌నగర్ గ్రామంలోని ఆమన్‌గల్, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్ (ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో (ఫలక్‌నుమా సమీపంలో) ఇళ్లు నిర్మిస్తామని, ఆసక్తి ఉన్న నిరుపేదలు సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


