భారీ బడ్జెట్ సినిమా లేదా స్టార్ హీరోల చిత్రాల విడుదల తేదీ దగ్గరపడుతోందంటే చాలు.. సినీ అభిమానుల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ‘అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఎన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి?’ సినిమా రిలీజ్ కాకముందే కొన్ని రోజుల ముందు నుంచే టిక్కెట్ల విక్రయాలు మొదలైపోతాయి. అసలు విడుదల చేయకుండానే టిక్కెట్లు ఎందుకు అమ్ముతారు? దీని వెనుక ఉన్న అసలైన వ్యాపార సూత్రం ఏమిటి? నిర్మాతలకు, థియేటర్ యాజమాన్యాలకు ఇది ఎలా లాభిస్తుంది? ఈ ఆసక్తికరమైన అంశాల వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను తెలుసుకుందాం.
ప్రేక్షకుల నాడిని పట్టేలా..
అడ్వాన్స్ బుకింగ్ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని, డిమాండ్‌ను ముందే అంచనా వేయడం. విడుదల తేదీకి చాలా రోజుల ముందే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటే, ఆ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయని అర్థం. అదే సమయంలో బుకింగ్స్ నెమ్మదిగా ఉంటే, ప్రేక్షకుల్లో బజ్ తక్కువగా ఉందని చిత్ర యూనిట్ గ్రహిస్తుంది. విధంగా అడ్వాన్స్ బుకింగ్ అనేది సినిమా విడుదల కాకముందే ప్రేక్షకుల నాడిని పట్టే ఒక ‘ప్రీ-రిలీజ్ డిమాండ్ టెస్ట్’గా పనిచేస్తుంది.
ముందస్తు వసూళ్ల అంచనా
సినిమా విడుదలకు ముందే వేలాది లేదా లక్షలాది టిక్కెట్లు అమ్ముడైనప్పుడు, మొదటి రోజు ఎంత మొత్తం వసూలు కావచ్చో మేకర్స్‌కు స్పష్టమైన అంచనా వస్తుంది. అయితే, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చిన డబ్బే సినిమా మొత్తం కలెక్షన్ కాదు. సినిమా విడుదలైన తర్వాత వచ్చే ప్రేక్షకుల ఆధారంగా అసలు లెక్కలు మారతాయి. అయినప్పటికీ, మొదటి రోజు, తొలి వీకెండ్‌లో రాగల వసూళ్లను పక్కాగా లెక్కగట్టేందుకు ఈ గణాంకాలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయి.
థియేటర్ల షో ప్లానింగ్ కోసం..
అడ్వాన్స్ బుకింగ్ కేవలం చిత్ర నిర్మాతలకే కాకుండా థియేటర్ యజమానులకు అత్యంత అవసరం. ఏ ఆటకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు? ఏ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉందో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా షోలను కేటాయిస్తారు. సాయంత్రం, రాత్రి షోలు వేగంగా నిండిపోతుంటే అదనపు స్క్రీన్లు లేదా షోలను జోడిస్తారు. డిమాండ్ తక్కువగా ఉన్న సమయాల్లో షోల సంఖ్యను తగ్గించి నష్టాలు రాకుండా థియేటర్ యాజమాన్యాలు ప్లాన్ చేసుకుంటాయి.
ప్రేక్షకులకు క్యూల తిప్పలు దూరం
ఈ విధానం వల్ల ప్రేక్షకులకు గొప్ప వెసులుబాటు లభిస్తుంది. ముఖ్యంగా భారీ చిత్రాల విడుదలకు థియేటర్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ముందే టిక్కెట్ బుక్ చేసుకోవడం ద్వారా విడుదల రోజున టికెట్ కౌంటర్ వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది. తమకు నచ్చిన సీటును, అనువైన సమయాన్ని ఎంచుకునే వెసులుబాటు ఆన్‌లైన్ బుకింగ్స్ కల్పిస్తాయి.
సోషల్ మీడియా హైప్ అండ్ మైండ్ గేమ్
అడ్వాన్స్ బుకింగ్ గణాంకాలు సినిమా ప్రచారంలో శక్తివంతమైన ఆయుధంగా మారతాయి. ‘గంటల్లోనే లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి’, ‘ఫస్ట్ డే షోలు అన్నీ హౌస్‌ఫుల్’ అనే వార్తలు సోషల్ మీడియాలో రాగానే, సాధారణ ప్రేక్షకుల్లో కూడా సినిమా చూడాలనే కుతూహలం పెరుగుతుంది. ఈ హైప్ సినిమాకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టి, మిగిలిన టిక్కెట్లు కూడా జోరుగా అమ్ముడయ్యేలా చేస్తుంది.
హిట్ లేదా ఫ్లాప్ నిర్ణయిస్తుందా?
అడ్వాన్స్ బుకింగ్‌లు భారీగా జరిగినంత మాత్రాన ఒక సినిమా హిట్ అయిపోయినట్లు కాదు. ఇది కేవలం ప్రారంభ ఆసక్తిని మాత్రమే సూచిస్తుంది. సినిమా దీర్ఘకాలిక విజయం అనేది కథ, ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీ, రివ్యూలు, సెలవులు, పోటీ చిత్రాలపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు బుకింగ్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కంటెంట్ బాగాలేకపోతే మొదటి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఒక్కసారిగా పడిపోతాయి.
ఇది కూడా చదవండి: ‘కుక్కకు రాఖీనా?’.. కృతిపై ఫ్యాన్స్ ఆగ్రహం


