నీరు, విద్యుత్, విద్యపై మరింత దృష్టి పెట్టాలి
ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెరుగ్గా రాణిస్తున్న గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాలు 2047 కన్నా ముందుగానే వికసిత (అభివృద్ధి చెందిన) రాష్ట్రాలుగా ఎదిగేందుకు తమకు తాము స్వయంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని కేంద్ర ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సూచించారు. ఇందుకోసం మరిన్ని కీలక సంస్కరణలను అమల్లోకి తేవాలని పేర్కొన్నారు.
అలాగే, జల వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, నాణ్యమైన విద్యుత్, విద్య అందించడం లాంటి అంశాలపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ సీఐఐ తెలంగాణ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఎఫ్‌డీఆర్) నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా అహ్లువాలియా ఈ విషయాలు తెలిపారు. 2047 నాటికల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) నిలపాలని కేంద్రం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విద్యుత్‌కి టైమ్ ఆఫ్ డే టారిఫ్‌లు..
రాష్ట్రాల స్థాయిలో స్థల సమీకరణ పెద్ద సమస్యగా ఉంటోందని, దీన్ని పరిష్కరించేందుకు తగు చర్యలు అవసరమని అహ్లువాలియా చెప్పారు. ఇక విద్యుత్‌కి సంబంధించి టైమ్ ఆఫ్ డే (టీవోడీ) టారిఫ్‌ల (రోజులో వినియోగ ధోరణులకు అనుగుణంగా చార్జీలు) విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే, మరిన్ని రాష్ట్రాలు ప్రైవేట్ డిస్కంలను అనుమతించడం వల్ల గణనీయంగా ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.
జీఎస్‌టీలో తమకొచ్చే ఆదాయాన్ని పెంచుకునేలా అత్యున్నత స్థాయి కమిటీలతో అధ్యయనాలు నిర్వహించి రాష్ట్రాలు జీఎస్‌టీ కౌన్సిల్ ముందు ప్రతిపాదనలు ఉంచాలని పేర్కొన్నారు. సంక్షేమాల కన్నా దీర్ఘకాలికంగా వ్యవస్థకు ఆర్థిక ప్రయోజనాలందించే విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలని ఎఫ్‌డీఆర్ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సూచించారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధిలో భాగమయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
మరోవైపు, దేశీయంగా వివాదాల పరిష్కారానికి సరైన వ్యవస్థ లేకపోవడంతో పలు ప్రాజెక్టులకు సమస్యగా ఉంటోందని, దీన్ని సత్వరం పరిష్కరించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఎం గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులు, ఇన్‌ఫ్రా తదితర 5 కీలకాంశాలపై మరింతగా ఫోకస్ చేస్తే 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న తెలంగాణ లక్ష్యం సుసాధ్యమేనని చెప్పారు.
ఇదీ చదవండి: గోల్డ్, సిల్వర్.. క్రాష్!


