న్యూఢిల్లీ: పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో తీవ్ర వాతావరణ అలజడి నెలకొంది. ప్రస్తుత ఆగస్టు మాసంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఒకేసారి నాలుగు తుపాన్లు క్రియాశీలంగా మారిన అరుదైన పరిస్థితి ఏర్పడింది. గతంలో నవంబర్ 2024లో ఇలా ఒకేసారి నాలుగు తుపాన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్‌లో తీవ్ర తుపాను ‘సౌడెల్’తో పాటు ‘నారా’, ‘గైనారి’, ‘అత్సాని’ అనే మూడు ఉష్ణమండల తుపాన్లు (ట్రాపికల్ స్టార్మ్స్) కొనసాగుతున్నాయి. ఈ నాలుగు తుపాన్ల తీవ్రత, గమనం, స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి.
సౌడెల్: వీటిలో ‘సౌడెల్’ అత్యంత శక్తిమంతమైనది. దీని గాలి వేగం గంటకు 165 కిలోమీటర్లు ఉండగా, తీవ్ర గాలుల వేగం గంటకు 240 కిలోమీటర్ల వరకు చేరుతోంది. ఇది ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తోంది.
నారా: ఈ తుపాను గాలి వేగం గంటకు 75 కిలోమీటర్లు, తీవ్ర గాలులు గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఇది ప్రస్తుతం కదలిక పెద్దగా లేకుండా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.
గైనారి: దీనిలో గాలి వేగం గంటకు 65 కిలోమీటర్లు, తీవ్ర గాలుల వేగం 95 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది కూడా ఒకే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది.
అత్సాని: సుమారు 15.1° ఉత్తర అక్షాంశం, 137.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైన ఈ తుపాను గాలి వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంది. ఇది గంటకు దాదాపు 25 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతోంది.
ఒకే సమయంలో నాలుగు తుపాన్లు సక్రియంగా ఉన్నప్పటికీ, అవి వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతుండటంతో ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతానికే ముప్పు పొంచి ఉందని చెప్పలేమని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణ సంస్థలు వీటి గమనం, తీవ్రతపై నిరంతర నిఘా ఉంచాయి.
ఇది కూడా చదవండి: రాఖీ సమీపిస్తున్న వేళ.. భారీగా కల్తీ రసగుల్లాలు స్వాధీనం!


