నోస్టాల్జియా
ఆగస్టు పదిహేనంటే ముందు దేశభక్తి గీతాల అడావిడి. క్లాసులో ఎవరికీ సరిగా పాడటం రాదు. కాని అందరూ చేతులెత్తేవారే. ఊరి హైస్కూల్లో... ఏ హైస్కూల్లో అయినా నలుగురైదుగురు టీచరమ్మలు ఉంటారు. ఒక ఐవోరుకి పాటల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. అంతో ఇంతో పాడేవాడై కూడా ఉంటాడు. వీళ్లకు హెడ్మాస్టర్ పుణ్యమా అని ఈ దేశభక్తి పాటల డ్యూటీ.
ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్లను వెతికి గ్రూపులు చేసి పాడించడం. మరి టెన్త్‌క్లాస్ వాళ్లో? వాళ్లకు పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. చదువుకోవాలి. ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంచాలి. అయితే ఒక సర్దా ఉందండోయ్. రిహార్సల్స్ పేరు చెప్పి పీరియడ్స్ ఎగ్గొట్టొచ్చు. ఐవోర్ల స్టాఫ్‌రూమ్‌లో రిహార్సల్స్. ప్రతిసారీ అవే పాటలు. బ్యాచ్‌లు మారతాయంతే.
‘వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం’..
‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’...
‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా’...
‘సారే జహాసే అచ్ఛా హిందూసితా హమారా’...
‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’...
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’....
అదేంటోగాని ఆగస్టు పదిహేనుకు ఫండు పిల్లలే తేవాలి. రంగు కాగితాలకీ, చార్ట్‌లకీ, పురికొసలకీ. ఇంట్లో అడగాలి. ఎంత? పావలా... అర్ధరూపాయి... అమ్మో అన్ని డబ్బులే. మరి 1985–86ల్లో అవి పెద్ద డబ్బులే. కొందరు తెచ్చేవారు. కొందరు మెదలకుండా ఉండేవాళ్లు. క్లాసులో ఎవడైతే పరమ బేవార్సు స్టూడెంట్‌గా ఉంటాడో వాడికి రంగు కాగితాలు కట్ చేయడంలో, రంగురంగుల త్రికోణాలు పురికొసకు అంటించి వేళ్లాడగట్టడంలో తోట తరణి అంత అనుభవం ఉంటుంది. వాడికి సేకరించి ఐదురూపాయల పావలా ఇస్తే తుర్రున బుక్‌స్టోర్‌కు పరిగెత్తి రంగు కాగితాలూ కత్తెర కొని ఒక టీమ్‌తో మైదా పిండి ఉడకబెట్టించి ఆ పనిలో ఉంటాడు. బోర్డును నీటుగా కడిగి, తడిపిన రంగు చాక్‌పీస్‌లతో ‘స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందంగా రాసే స్టూడెంట్‌లు ప్రతి క్లాస్‌లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు మ్యాథ్స్‌లో వీక్... డ్రాయింగ్‌లో ఫస్ట్. ఈ డ్యూటీ వారిది.
అయితే ప్రతి సెక్షన్ వారికీ ఈ ఆగస్టు 15న కాస్త కుళ్లు ఉండేది ఒకే ఒక వ్యక్తి మీద. వాడు ఎస్.పి.ఎల్. ఆ రోజు వాడి డాబు, దర్పాన్ని ఆపేవాడుండదు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వాడు ఎన్‌సిసి డ్రస్సు లాంటిది వేసుకొని ఎర్రబంతి వేళ్లాడే ఖాకీ క్యాప్ పెట్టుకొని ఏ పోలీస్ ఆఫీసరులానో ఉంటాడు. వాడు ‘అటెన్షన్’ అంటే అటెన్షన్. వాడు ‘స్టాండ్ ఎట్ ఈజ్’... అంటే తెరిపి. జెండా ఎగరేయడానికి వీడు మార్చింగ్ చేస్తూ హెడ్‌మాస్టర్‌ని, చీఫ్‌గెస్టునీ తీసుకొస్తాడు. జెండా ఎగరేశాక వీడు సెల్యూట్ కొడితే హెడ్మాస్టర్ వీడికి సెల్యూట్ కొడతారు. మిగిలిన పిల్లలకి ఈ చాన్స్ ఎక్కడా? అందుకే వాడంటే కొంచెం ఇది.
ఆగస్టు పదిహేనుకు పూలు తెచ్చి జెండాలో పెట్టే పని టీచరమ్మలది. పూలున్న జెండాను పొట్లంలా చుట్టి జెండాకర్ర కొసాకు పంపించడం, తాడు లాగినప్పుడు జెండా విడివడి పూలు అందరి మీద పడేలా కట్టడం అందరికీ వచ్చనుకుంటున్నారా? రాదు. దానికి పీఈటీ వోరు ఎక్స్‌పర్ట్. ఆయనే అది చేయాలి. మనం చేస్తే తాడు లాగితే జెండా ఊడదు. పరువు పోతుంది. అందుకని ప్రతి ఆగస్టు 15న తాడు లాగితే జెండా ఎగరుతుందా లేదా అని అదో టెన్షన్.
ప్రతి స్టూడెంట్ బాగా ఉతికిన యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకొని మరీ ఆ రోజున వేసుకోవాలి. చెంబిస్త్రీ, చేటిస్త్రీ తప్పదు. పాపం హాస్టల్ పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొచ్చినా వారికి ఇస్త్రీ వీలు లేకపోవడంతో చిన్నబుచ్చుకునేవారు. ఫ్రెండ్సు వారితో చేరి ‘ఏం పర్లేదు లేరా. మీ చొక్కాలే మా చొక్కాల కంటే తెల్లగా ఉన్నాయి’ అని ఉత్సాహపరిచేవారు. వారు నూనె రాసుకున్న తలలతో తెల్లగా నవ్వేవారు.
రోజూ స్కూలు ఉదయం తొమ్మిదికైతే ఆ రోజున ఎనిమిదికే సిద్ధం. గ్రౌండ్‌లో సుద్దపొడి వేసి లైన్లు కొట్టి ఒక్కో సెక్షన్ ఒక్కో లైన్‌లో నిలబడేలా చేసేవారు. జెండా కర్ర దగ్గర స్టేజ్. ఊరి ఆర్‌డివోనో తాసిల్దారో రిటైరై వెళ్లిపోయిన హెడ్మాస్టరో చీఫ్ గెస్టు. టిఫిన్ చేసొచ్చిన పిల్లలూ... చేయకుండా వచ్చిన పిల్లలూ... చాక్లెట్లు ఎన్ని పంచొచ్చో ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న పిల్లలూ... వీళ్లు మళ్లీ ఇంట్లో తోబుట్టువులకు హామీ ఇచ్చి వచ్చి ఉంటారు... చాక్లెట్లు తెచ్చిస్తా అని. అదొక టెన్షన్. హెడ్మాస్టర్ మూడ్ బాగుంటే రెండు పెద్ద పెద్ద పళ్లేలు తెప్పించి మూడు నాలుగు రకాల చాక్లెట్లు పోయించి, నయాపైసాకు ఒకటి వచ్చే బ్రిటానియా రౌండ్ బిస్కెట్లు వాటిలో కలిపి, మిశ్రీ ముక్కలు కూడా మిక్స్ చేసి గుప్పెడు గుప్పెడు పంచితే అదీ కిక్కు. పాపం కొన్ని వీధి బడుల్లో బొరుగుల్లో బెల్లం ముక్కలు కలిపి పంచేవారు. ఆ స్కూళ్ల ఆగస్టు 15కు పిల్లలు వెళ్లేవాళ్లు కాదు.
అయితే చాక్లెట్లు, బిస్కెట్లు అంత సులువుగా రావు. ఎండ వాయకొడుతున్నా లెక్కచేయకుండా జెండా వందనం చేయించి, దేశభక్తి గీతాలు పాడించి, గెస్టు స్పీచు, హెడ్మాస్టరు స్పెషలు స్పీచు ఇచ్చి... దేశం తాలుకు బాధ్యతలన్నీ ఆ పూట ఎదురుగా నిలుచున్న పిట్ల ప్రాణాలకే అప్పజెప్పేసేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేసేవారు. ఆ బాలలేమో స్కూల్లేదు కదా... మధ్యాహ్నం మేట్నీకి డబ్బులెలా అనే మనాదిలో ఉంటారు.
ఇన్నింటి మధ్య కూడా ఆగస్టు పదిహేను బాగుండేది. స్కూల్లోని ప్రతి క్లాసు రంగు కాగితాలతో రెపరెపలాడేది. ప్రతి గుండె మీద త్రివర్ణపతాకం గుండు పిన్నుతో అంటుకుపోయేది. ప్రతి పెదవి మీద గాంధీ నెహ్రూ సుభాసుబోసు భగత్‌సింగుల పేరు పలికేది. ‘హమ్ బుల్‌బులేహై ఇస్‌కే ఏ గుల్‌సితా హమారా’... ఈ దేశపు గువ్వపిట్టలం... రెక్కలు సాచి ఎగురతాం అని పాడుతూ ప్రతి చిన్నారి హృదయం ఆకాంక్ష చేసేది. పొందికైన బట్టల్లో టీచర్లు, ఉపాధ్యాయులు హుందాగా కనిపించేవారు. ప్రతి పీరియడ్‌కూ బెల్లు కొట్టే ప్యూన్ ఆ రోజు చాక్లెట్లు పంచుతూ చక్కగా నవ్వేవాడు. క్లాసులు చిమ్మే ఆయమ్మ కొప్పులో చామంతులు పెట్టుకొని కొత్తగా కనిపించేది. అందరం పెద్దయ్యి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కాసేపైనా గట్టిగా అనిపించేది.
ఇక రోజూ చేసే ప్రతిజ్ఞ ఆ రోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. ‘నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను’.... ఈ ఒక్కలైను భవిష్యత్తు సమాజాన్ని నిర్మించేది. ‘ఈ దేశ సంపదకు అర్హుడనవ్వడానికి సదా కృషి చేస్తాను’ ఈ లైనూ ముఖ్యమే.
మనం అర్హులమై ఉండాలి. మనం మన సమాజాన్ని ప్రేమించడానికి. మనల్ని మన దేశం ప్రేమించడానికి. పాఠశాల మరో తల్లి గర్భం. అక్కడ పొందే జవసత్వాలు, బుద్ధి కుశలతలు, చదువూ సంస్కారాలు... ఇవే నిజమైన దేశభక్తి. ఇవే నిజమైన ఆగస్టు 15. ప్రతి తరాన్ని ‘అర్హులైన తరం’గా మలచగలినంత కాలం మన దేశ ఖ్యాతికీ, దీప్తికీ ఢోకా లేదు. అలా జరిగినంత కాలం విశ్వానికి మనమే ‘భాగ్య విధాతలం’. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... భరతమాతకు ప్రతిరూపమే. ఏ తల్లిబిడ్డలైనా అందరూ భరతమాత బిడ్డలే.
జెండా ఊంచా రహేగా హమారా.
భారతమాతాకీ జై.
జైహింద్!
విదేశీ గడ్డపై మన జెండా!
జర్మనీలోని స్టట్‌గార్డ్‌లో 1907లో జరిగిన ఒక విప్లవ సమావేశంలో భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్షలను చాటి చెప్పేలా డిజైన్ చేసిన ఒక జెండా (ఇప్పటి జాతీయ జెండా కాదు)ను ఎగరేశారు భికాజీ కామా. విదేశీ గడ్డపై మన జెండా ఎగరేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గాంధీ గారి రేడియో
నానిక్ మోత్వానీ అనే వ్యాపారవేత్త అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచి రివర్స్–ఇంజినీర్ యాంప్లిఫయర్స్, మైక్రోఫోన్స్, లౌడ్‌స్పీకర్‌లను దిగుమతి చేసుకొని ‘చికాగో రేడియో’ ప్రారంభించారు. ఈ రేడియో మహాత్మాగాంధీ ప్రసంగాలను విస్తృతంగా ప్రసారం చేసేది. స్వాతంత్య్ర సమరయోధులు రహస్య, భూగర్భ నెట్‌వర్క్‌లను నడపడంలో మోత్వానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలు ఉపయోగపడ్డాయి.
క్యాట్ ఆర్మీ
స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై నిరసన కార్యక్రమాలు సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించేవారు. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సూరత్‌లో క్యాట్ ఆర్మీ(మంజరి సేన) అనే సంఘంలోని మహిళలు జాతీయజెండా రంగులలో ముంచిన ఖాదీ వస్త్రాలు ధరించి బ్రిటిష్ అధికారులను ధిక్కరించారు. ∙సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు లక్నోలాంటి నగరాల్లో ‘సైమన్ గో బ్యాక్’ అని రాసి ఉన్న గాలిపటాలను ఎగరేశారు.
అసామాన్య మహిళలు
కొత్తగా వెలుగులోకి వచ్చిన బీబీసి వారి ఫొటో ఆర్కైవ్‌లో.... ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య మహిళలు ఎంత ధైర్యసాహసాలు, అంకితభావంతో పాల్గొన్నారో, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా నడిపించారో కళ్లకు కట్టే ఫొటోలు ఉన్నాయి. పోలీసులను బహిరంగంగా సవాలు చేశారు, మాటకు మాట బదులిచ్చారు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు.
నివేదిత వజ్ర ఫ్లాగ్
సిస్టర్ నివేదిత 1904లో భారత జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. ‘నివేదిత వజ్ర ఫ్లాగ్’ అని పిలిచే ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగుల నేపథ్యం, తెల్లని తామరపువ్వుతో కూడిన వజ్రం చిహ్నం, వందేమాతరం నినాదం కనిపిస్తాయి.
దండి యాత్రలో అతి పిన్న వయస్కుడు
ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సబర్మతి ఆశ్రమం నుండి ‘దండి యాత్ర’ ప్రారంభించారు గాంధీజీ. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కుడు పదహారేళ్ల విఠల్ లీలాధర్ ఠక్కర్.


