1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ముందు పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, తక్కువ పారిశ్రామిక సామర్థ్యం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో.. సాధారణ కుటుంబానికి స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. కనీస అవసరాలు తీరే మంచి జీవితం రావాలనే ఆశ కూడా.
చారిత్రక అంచనాల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తొలి దశాబ్దాల్లో దేశ ఆర్థిక ప్రయాణం ప్రధానంగా ప్రజలను కనీస జీవన ప్రమాణాల వైపు తీసుకెళ్లడంపైనే సాగింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ఒకప్పుడు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనడం పెద్ద లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఏ బ్రాండ్ కొనాలి, ఎలాంటి కారు తీసుకోవాలి, వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలి అనే స్థాయికి భారతీయుల ఆలోచనలు మారాయి.
ఈ మార్పు మన ఇళ్లలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు టీవీ కొనడం పెద్ద విషయం. ఆ తర్వాత ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, స్కూటర్, కారు వంటివి కుటుంబాల అవసరాల జాబితాలోకి చేరాయి. ఇప్పుడు మాత్రం సాధారణ కారు సరిపోతుందా? SUV కొనాలా? ఎలక్ట్రిక్ కారు తీసుకోవాలా? అనే స్థాయికి వినియోగదారుల ఆలోచన చేరింది.
ఏం కొనాలి నుంచి..
పొదుపు విషయంలోనూ మార్పు వచ్చింది. గతంలో బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తులే ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, సిప్, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడులు కూడా సాధారణ కుటుంబాలకు పరిచయం అయ్యాయి. అంటే.. భారతీయుల కథ ''ఏం కొనాలి?'' అనే స్థాయి నుంచి ''ఏది నాకు ఎక్కువ విలువ ఇస్తుంది?'' అనే స్థాయికి మారుతోంది.
కుటుంబాల ఖర్చుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ, పట్టణ వినియోగ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతోంది. గతంలో పట్టణ కుటుంబాలు గ్రామీణ కుటుంబాల కంటే చాలా ఎక్కువ ఖర్చు చేసేవి. ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఆదాయం, డిజిటల్ సేవలు, క్రెడిట్ సౌకర్యాలు, ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో వినియోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి. గతంలో ''కూడు, గూడు, గుడ్డ'' ప్రధాన అవసరాలైతే.. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఏ బ్రాండ్ దుస్తులు ధరించాలి, ఏ ప్రాంతంలో నివసించాలి అనే ఎంపికలు కూడా వినియోగంలో భాగమవుతున్నాయి.
ఎలక్ట్రానిక్స్ విషయంలో..
కారు, మొబైల్, ప్రయాణం వంటి రంగాల్లో ఈ ప్రీమియమైజేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు కొనడం పెద్ద కల. ఇప్పుడు SUVలపై భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. కొత్త కారు కొనలేని వారు కూడా మంచి ఫీచర్లు ఉన్న ప్రీమియం సెకండ్‌హ్యాండ్ కార్ల వైపు చూస్తున్నారు.
ఇదే విధంగా రూ.30 వేలకుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. వినియోగదారులు ప్రతి వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయడం లేదు. తమకు ముఖ్యమైన వస్తువుల విషయంలో మాత్రం ఎక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇక ప్రయాణాల విషయంలోనూ మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు ఒకప్పుడు కొద్దిమంది సంపన్నులకు మాత్రమే సాధ్యమైన విషయం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా విదేశీ ట్రిప్ ఒక సాధారణ ఆశగా మారుతోంది. 2025లో భారతీయులు రికార్డు స్థాయిలో 3.28 కోట్లకు పైగా విదేశీ ప్రయాణాలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పొదుపు నుంచి సంపద సృష్టి
ఇక మరో పెద్ద మార్పు పొదుపు నుంచి సంపద సృష్టి వైపు వచ్చింది. గతంలో భవిష్యత్ భద్రత కోసం డబ్బును బ్యాంకులో దాచుకోవడం, బంగారం కొనడం లేదా స్థలం తీసుకోవడం సాధారణం. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతి కుటుంబాలు కూడా సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. వార్షిక గృహ ఆర్థిక పొదుపుల్లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వాటా FY12లో కేవలం 2 శాతం ఉండగా, FY25 నాటికి 15 శాతానికి పైగా పెరిగింది. సిప్ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అంటే భారతీయుల ఆర్థిక ఆశయం కూడా మారుతోంది. 'డబ్బు దాచుకోవాలి అనే ఆలోచన నుంచి 'డబ్బుతో మరింత సంపద సృష్టించాలి' అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు.


