భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్‌ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్‌కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్‌పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.
బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.
Me and my wife have been running a social experiment in Bangalore.
Whenever we park our two wheeler in any area, we don't lock our helmets. We just keep it on the side mirror or on the seat.
It's a low cost experiment to know if Bangalore is a high trust city or not.
It has…— Siddharth Dialani (@siddharth_iitm) August 13, 2026


