ఇంటి ముందు సొంత కారును నిలిపే సౌకర్యం కూడా ఇకపై ఉచితం కాదు. అవును.. దేశంలోనే ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్ల దురాక్రమణను అరికట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖ ‘గ్రేటర్ బెంగళూరు అథారిటీ (పార్కింగ్) నిబంధనలు-2026’ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం నివాస ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రకాన్ని బట్టి ఏటా గరిష్ఠంగా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వాహన రకాన్ని బట్టి వార్షిక రుసుములు
ప్రతిపాదిత డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం నివాస వీధుల్లో పార్కింగ్ చేయడానికి వార్షిక పర్మిట్ తప్పనిసరి. అందుకోసం హ్యాచ్‌బ్యాక్ / చిన్న కార్లకు ఏటా రూ.15,000, సెడాన్ కార్లకు ఏటా రూ.20,000, ఎస్‌యూవీలకు ఏటా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ కాలపరిమితి ఏడాది మాత్రమే. అయితే, భవన నిర్మాణ నిబంధనలకు లోబడి సొంత స్థలంలో నిర్ణీత పార్కింగ్ సదుపాయం ఉన్న నివాసాల వద్ద మాత్రమే పర్మిట్లు మంజూరు చేస్తారు. రహదారి వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి ట్రాఫిక్‌కు ఆటంకం కలగని చోట్లే ఈ పర్మిట్ చెల్లుబాటు అవుతుంది.
ఆన్-స్ట్రీట్, ఆఫ్-స్ట్రీట్ చార్జీలు
వాణిజ్య, ప్రధాన రహదారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించారు. ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌లో భాగంగా కార్లకు గంటకు రూ.40-రూ.80 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 వరకు వసూలు చేయనున్నారు. రెండు గంటలు దాటితే చార్జీలు మరింత పెరుగుతాయి. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ చార్జీలను తగ్గించారు. కార్లకు నెలకు రూ.2,000-రూ.4,000 కాగా రాత్రి వేళల్లో (రాత్రి 8-ఉదయం 8 వరకు) 50% రాయితీ ఇవ్వనున్నారు.
అభ్యంతరాలకు 30 రోజుల గడువు
ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సమర్పణకు ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. వాహనాల విచ్చలవిడి పార్కింగ్‌ను నియంత్రించాలని చూస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


