శివాజీనగర: అసెంబ్లీ వర్షాకాల సమావేశం గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే రెండు భిన్న అంశాలపై డీకే శివకుమార్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తొలి రోజున మొదటగా, దివంగత ప్రముఖులకు సంతాపం తెలియజేయాలా?, లేదా కొత్త మంత్రులను పరిచయం చేయాలా అనే ధర్మసందేహం తలెత్తింది. చివరకు సంతాపానికే ఆమోదం తెలిపారు.
ప్రార్థనల తరువాత ప్రారంభం...
ఉదయమే విధానసభలో వందేమాతరం, జాతీయ గీతాలాపనతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. తరువాత ముఖ్యమంత్రి డీ.కే. ఇటీవల మంత్రివర్గంలోకి చేరిన కొత్త మంత్రులను పరిచయం చేయబోయారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ నిలబడి, మొదట సంతాప సందేశాల కార్యక్రమం జరగాలని కోరారు. సోమవారం కొత్త మంత్రులను పరిచయం చేయవచ్చని, సంతాపాన్ని, సంతోషాన్ని కలపవద్దని సూచించారు. ఈ సమయంలో తాత్కాలిక స్పీకర్ టీ.బీ జయచంద్ర జోక్యం చేసుకుని, సంతాప తీర్మానాన్ని ఇంకా సభలో ప్రవేశపెట్టలేదని, అందువల్ల కొత్త మంత్రులను పరిచయం చేయవచ్చని సీఎం తరఫున మాట్లాడారు. ఇందుకు నిబంధనలు కూడా అనుమతిస్తాయన్నారు. సంతాప సందేశాల సందర్భాన్ని గౌరవించడం కూడా ముఖ్యమని సభాపతి తెలిపారు. ఈ చర్చతో సీఎం మనసు మార్చుకుని, ముందుగా సంతాప సందేశం ఇస్తామని, ఆ తరువాత కొత్త మంత్రులను పరిచయం చేస్తామని తెలిపారు. ఇలా సభాపతి సంతాప తీర్మానాన్ని చేపట్టారు. దీంతో కొత్త మంత్రుల పరిచయం వాయిదా పడింది.
వారి సేవలకు వందనాలు
15 మంది దివంగత ప్రముఖులకు సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు డీ.సుధాకర్, సీ.వీరన్న, వెంకటరమణప్ప, రామచంద్రగౌడ, మాజీ ఎమ్మెల్యేలు కే.ఆర్.శ్రీనివాసయ్య, పుట్ట రంగనాథ్, సయ్యద్ యాసీన్, వీ.శ్రీనివాసన్, చంద్రశేఖరప్ప, వెంకటాచలయ్య, ఎస్.కృష్ణప్ప, ప్రఖ్యాత గాయనీమణులు ఎస్.జానకి, ఆశా భోంస్లే, చెన్నమ్మ దేవెగౌడ సేవలను సీఎం, ప్రతిపక్ష నేతలు స్మరిస్తూ కొనియాడారు.
కరచాలనం
సమావేశాలకు ముందుగా సీఎం డీకే శివకుమార్ ప్రతిపక్ష నాయకులతో కరచాలనం చేసి సహకారం కోరారు. విధానసభలో వందేమాతరం గీతం ముగుస్తుండగా, సీఎం శివ, బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్‌తో కరచాలనం చేసి మాట్లాడారు. కాగా సమావేశాలకు ఎమ్మెల్యేల హాజరు ఓ మోస్తరుగా ఉంది. శుక్రవారం ఉభయ సభల సభాపతుల ఎన్నిక ప్రక్రియ సాగుతుంది.
తొలిరోజు విధానసభలో సీఎం డీకే, ప్రతిపక్ష నేత మధ్య ధర్మసందేహం
సంతాప తీర్మానానికే అంగీకారం
కొత్త మంత్రుల పరిచయం నేటికి వాయిదా


