మండ్య: కావేరి అఖండ కర్ణాటక బంద్‌కు మద్దతుగా మండ్య నగరంలోని జేసీ కూడలిలో కన్నడ, రైతు సంఘాల కార్యకర్తలు నిరసన తెలిపారు. 20 కిలోల ఉలవలను వండి, వాటిని ఆరగిస్తూ ఆందోళన చేశారు. తమిళనాడుకు నదీ జలాలను వదిలి, మండ్య జిల్లా రైతులు ఉలవలు తినే పరిస్థితిని అధికారులు, ప్రభుత్వం కల్పిస్తున్నాయని విమర్శించారు. మైసూరు–బెంగళూరు హైవేలో పలుచోట్ల రాస్తారోకోలు చేశారు. బంద్‌కు సహకరించాలని వ్యాపారులను కోరారు. కొంతసేపు షాపులు మూసివేసిన వ్యాపారులు కార్యకర్తలు వెళ్లిపోయాక మళ్లీ తెరిచారు. జిల్లాలో బంద్ విజయవంతం కానప్పటికీ, రైతుల ఉద్యమం కొనసాగుతోంది.
బాలుడు– బైక్ ప్రమాదం..
గొడవపడి తల్లిదండ్రుల ఆత్మహత్య
యశవంతపుర: కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయంపై తల్లిదండ్రులు పరస్పరం వాదులాడుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మైనర్ డ్రైవింగ్ ఇంత ఘోరానికి కారణమైంది. ఈ ఘటన కార్వార సమీపంలోని శిరవాడలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. శిరవాడలో వెంకటేశ్ (38), విజయ వడ్డర్(36) దంపతులు, కుమారుడు (16) నివసిస్తున్నారు. ఈ బాలుడు ఆదివారం బైక్‌లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన అతన్ని కార్వార కిమ్స్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు రెండు శస్త్రచికిత్సలు చేశారు. కుమారుడిని అదుపులో ఉంచకపోవడం వల్ల ఇలా జరిగిందని వెంకటేశ్ భార్య విజయపై మండిపడ్డాడు. దీంతో ఆమె మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా నీ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు గొడవ పడ్డారు. దీంతో వెంకటేశ్ గురువారం ఆళేవాడ–కోడిబాగ్ దగ్గర కాలువలోకి దూకి చనిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.


