‘ఆపండి.. ప్లీజ్‌’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్‌ నుంచి దూకిన యువతి | Delhi Ayesha Srivastav Injured After Jumping From Moving Rapido Bike | Sakshi
Sakshi News home page

‘ఆపండి.. ప్లీజ్‌’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్‌ నుంచి దూకిన యువతి

Aug 14 2026 8:01 AM | Updated on Aug 14 2026 8:37 AM

Delhi Ayesha Srivastav Injured After Jumping From Moving Rapido Bike

ఆఫీసుకు వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న ర్యాపిడో బైక్‌.. కొద్దిసేపటికే ఆమెకు భయానక ప్రయాణంగా మారింది. తెలిసిన రోడ్డు కాస్తా నిర్మానుష్యమైన మార్గంగా మారింది. గమ్యం వైపు వెళ్తున్నామా.. లేక ఎక్కడికో తీసుకెళ్తున్నారా అన్న అనుమానం మొదలైంది. ‘బైక్‌ ఆపండి.. మరో రూట్‌లో వెళ్లండి’ అంటూ ఆమె ఎంత చెప్పినా డ్రైవర్‌ ఆపలేదని బాధితురాలు ఆరోపించారు. చివరకు ప్రాణాలపై భయంతో కదులుతున్న బైక్‌ నుంచే దూకేశారు. అనంతరం, ఓ వీడియో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.

వీడియో ప్రకారం.. బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ను బుక్‌ చేసుకున్నారు. తొలుత ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్‌ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా కనిపించే మరో మార్గంలోకి బైక్‌ను మళ్లించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చుట్టూ చూస్తే పెద్దగా జనసంచారం కనిపించకపోవడంతో భయపడినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. అది విశ్వవిద్యాలయానికి వెళ్లే నేరుగా ఉన్న దారేనని చెప్పినట్లు ఆయేషా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు. మరో మార్గంలో వెళ్లాలని, లేదంటే బైక్‌ను ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ డ్రైవర్‌ స్పందించలేదని ఆరోపించారు.

పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ఆమె.. డ్రైవర్‌ను ఆపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో తన భద్రతపై తీవ్ర భయానికి గురై.. చివరకు కదులుతున్న బైక్‌ నుంచి దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో ఆయేషా చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటన తర్వాత కూడా తనకు సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. ‍ర్యాపిడో కస్టమర్‌ సపోర్ట్‌ను సంప్రదించినా సకాలంలో స్పందన రాకపోవడంతో సోషల్‌ మీడియాను ఆశ్రయించారు.

 

‘వేలాది మంది మహిళలు ప్రతిరోజూ ర్యాపిడోలో ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో మీరు ఏం చేస్తున్నారు? డ్రైవర్‌ వివరాలు ఇవ్వండి. అతడిపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆమె సంస్థను ప్రశ్నించారు. ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌ను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించింది. డ్రైవర్‌ వివరాలను ఆయేషాకు అందజేసినట్లు, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో ఆమెకు సహకరిస్తామని తెలిపింది. వైద్య లేదా చట్టపరమైన సహాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement