‘అవసరానికి మించి మొబైల్ వాడకండి. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు, వాళ్లు మాట వినకుండా మారాం చేసేటప్పుడు ఫోన్ మాత్రం వాళ్లకు ఇవ్వకండి... అనుభవంతో చెబుతున్నా.. మొబైల్ వల్ల నరకం చూశా.’ అని ప్రముఖ నటి షకీల సోషల్ మీడియాలో తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన షకీల సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.. అయితే గంటల తరబడి ఫోన్ చూడడం, ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించేముందు ఫోన్ పక్కకు ఉంచి దానినే చూస్తూ పడుకోవడం వల్ల ఆమె ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఇటీవలే ఆమె మెడకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకుని డిచార్జ్ అయ్యారు.
ఈ ఆపరేషన్‌కు లక్షల ఖర్చయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం, యూట్యూబ్ కంటెంట్‌తో కాలక్షేపం చేయడం, అవసరం లేకున్నా ఏదో ఒకటి సర్ఫ్ చేస్తూ ఉండడం వల్లే ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మొబైల్ వాడకం అవసరమే.. కాని అవసరానికి మించి వాడడం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని షకీల పేర్కొన్నారు. విపరీతమైన మెడనొప్పి వల్ల తీవ్రమైన బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, మొబైల్‌కి వారిని దూరంగా ఉంచండంటూ షకీలసోషల్ మీడియాలో పిల్లల తల్లిదండ్రులను కోరారు.


