తెనాలి రూరల్: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు ఓ వివాహితతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమె నుంచి నగదు, ఆభరణాలు తీసుకోవడమే కాకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సేకరించిన వివరాల ప్రకారం... మండలంలోని జగ్గడిగుంట పాలెంకు చెందిన లక్ష్మీతిరుపతమ్మకు సోషల్ మీడియాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన బాజీ, నాగరాజు పరిచయమయ్యారు.
ఈ పరిచయం సాన్నిహిత్యానికి దారి తీసింది. ఆమె నుంచి వారిద్దరూ నగదు, ఆభరణాలు తీసుకున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలతో బెదిరిస్తూ ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు బాజీ, నాగరాజు బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ కె. ఆనంద్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఆమె మృతదేహాన్ని బుధవారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


