ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్
అక్రమ కేసులో జైలులో ఉన్న ఆయనకు పరామర్శ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాక్‌గార్డెన్, నన్నూరు, టోల్‌ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్, పుల్లూరు సర్కిల్ మీదుగా పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలుకు చేరుకుంటారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలిసి పరామర్శిస్తారు. ఆయనకు ధైర్యం చెప్పనున్నారు. అక్కడే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోనూ మాట్లాడతారు.
వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు సర్కారు కుట్రలు
చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా కలిసి, పరామర్శించేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు జనం రాకూడదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షారోన్‌లు హెచ్చరికలు జారీ చేశారు. కాదు కూడదని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌కు కర్నూలు జైలులో ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందన్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. 30 యాక్ట్ అమలులో ఉన్నందున జగన్‌ను చూసేందుకు జనం హాజరు కాకూడదన్నారు. ములాఖత్‌కు వస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో జనం రాకుండా కట్టడి చేయాలని రెండు జిల్లాల పోలీసులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనం రాకుండా పోలీసులు హెచ్చరికలు పంపుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


