జియో ఫెన్సింగ్‌తో.. జీతం కోత..బిల్లు మోత.! | New procedure for recording readings in electricity meters | Sakshi
Sakshi News home page

జియో ఫెన్సింగ్‌తో.. జీతం కోత..బిల్లు మోత.!

Aug 13 2026 3:20 AM | Updated on Aug 13 2026 3:20 AM

New procedure for recording readings in electricity meters

విద్యుత్‌ మీటర్లలో రీడింగ్‌ నమోదుకు కొత్త విధానం

తప్పులతడకలుగా ఉన్న సాఫ్ట్‌వేర్‌తో ఇబ్బందులు

ఇన్నాళ్లూ రోజుకి 300 సర్వీసుల బిల్లు ఇస్తున్న రీడర్లు 

ఇప్పుడు రోజుకు 100 కంటే తక్కువగా బిల్లింగ్‌

లేట్‌ బిల్లింగ్‌ జరిగిందంటూ రీడర్ల జీతాల్లో కోత

రీడింగ్‌ నమోదులో ఆలస్యానికి కొత్త వెర్షన్‌ కారణం

బాధ్యులను చేయడం అన్యాయమంటున్న రీడర్లు

బిల్లు ఆలస్యం కావడంతో వినియోగదారులపై భారం

స్లాబులు మారిపోయి అధికంగా బిల్లు వచ్చే అవకాశం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ నమోదులో కొత్తగా అమలు చేస్తున్న జియో ఫెన్సింగ్‌ విధానం మీటర్‌ రీడర్లకు తలనొప్పిగా మారింది. సాంకేతిక లోపాలతో రీడింగ్‌ సకాలంలో నమోదు కాకపోతుండటంతో ఒకవైపు రీడర్లు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు వినియోగదారులపై అదనపు బిల్లు భారం పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు రోజుకు సుమారు 300 సర్వీసుల వరకు మీటర్లు స్కాన్‌ చేసి బిల్లులు ఇచ్చే రీడర్లు.. కొత్త వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ వచ్చిన తర్వాత 100 బిల్లులు కూడా నమోదు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. మీటర్‌ వద్దకు వెళ్లినా జియో ఫెన్సింగ్‌ సరిగ్గా పనిచేయక రీడింగ్‌ నమోదు కావడంలేదని చెబుతున్నారు. దీంతో నిర్ణీత గడువులో బిల్లింగ్‌ పూర్తి చేయడం కష్టంగా మారింది.

‘లేట్‌ బిల్లింగ్‌’ పేరుతో జీతాల్లో కోత: జియో ఫెన్సింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాల కారణంగా బిల్లింగ్‌ ఆలస్యమైనా.. బాధ్యతను మీటర్‌ రీడర్లపైనే మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీడింగ్‌ తీద్దామని మీటర్‌ వద్దకు వెళితే వివరాలు త్వరితగతిన నమోదు కావడం లేదు. దానివల్ల బిల్లు ఇవ్వడం కుదరడం లేదు. కానీ లేట్‌ బిల్లింగ్‌ జరిగిందంటూ అకౌంట్స్‌ విభాగం అధికారులు రీడర్ల జీతాల్లో కోతలు విధిస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సాఫ్ట్‌వేర్‌ సక్రమంగా పనిచేయకపోవడానికి తాము బాధ్యులం కాదని, అయినా తమపై చర్యలు తీసుకోవడం అన్యాయమని వాపోతున్నారు. ప్రతి నెల 12వ తేదీలోగా మీటర్ల రీడింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో ఇప్పటివరకు 50 శాతం కూడా రీడింగ్‌ పూర్తికాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే బిల్లింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

‘స్లాబ్‌’ మారితే వినియోగదారుడికే నష్టం
బిల్లింగ్‌ ఆలస్యమైతే వినియోగం ఎక్కువ రోజులకు కలిసిపోయే అవకాశం ఉంటుంది. దీంతో విద్యుత్‌ వినియోగం అధిక స్లాబ్‌లోకి వెళ్లి బిల్లు పెరిగే ప్రమాదం ఉంది. అంటే సాఫ్ట్‌వేర్‌ లోపం కారణంగా రీడర్‌కు జీతం కోత.. వినియోగదారుడికి అదనపు బిల్లు భారం పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలోని భీమవరం, ఏలూరు సర్కిళ్ల పరిధిలో సుమారు 500 మంది మీటర్‌ రీడర్లు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. సర్కిల్‌ స్థాయిలోని సీనియర్‌ అకౌంట్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సమస్యలను గుర్తించాల్సింది పోయి రీడర్లు, వినియోగదారులకు నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement