ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు.. రిజర్వేషన్లు.. కసరత్తు షురూ
17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితాలకు షెడ్యూల్
సెప్టెంబర్ 3లోగా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రకటన
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే పదవీ కాలం ముగిసిన మున్సిపల్, గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా జరగాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 నగర కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్పొరేషన్ డివిజన్లు, మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ఆయా జాబితాలను సెప్టెంబరు 3న అధికారికంగా ప్రకటించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
2026 జనవరి ఒకటికి ఓటు అర్హత పొందిన వారితో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల కమిషనర్ ప్రచురించిన ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్‌లో ఆయా జాబితాలను ప్రకటించాలని పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ పరంగానూ ఆయా నగర కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మేయర్లు, చైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు.
పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు షెడ్యూల్..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అధికారికంగా వెల్లడించగా.. తాజాగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా పోలింగ్ గుర్తింపు ప్రక్రియను ఆగస్టు నెలాఖరులో పూర్తి చేసి, 31వ తేదీన ఆయా పోలింగ్ జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి నివేదిక రూపంలో అందజేయాలని సూచించారు. కాగా, 20 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాల తయారీపై ఫిర్యాదులు అందడంతో ఆయా పంచాయతీల్లో కొత్తగా ఈ నెల 17 లోగా మళ్లీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ధారణపై సర్కారు దృష్టి
మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందస్తు కార్యక్రమాలను మొదలుపెట్టడంతో ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ధారణపై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజ్వరేషన్లు కల్పించాలన్న దానిపై ప్రభుత్వం ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రకటించే అవకాశం ఉందంటూ.. అందుకు అవస రమైన నివేదికలతో సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎస్ సాయి ప్రసాద్ ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీచేశారు.
సూపర్ సిక్స్ పథకాల ద్వారా, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో బీసీలకు కలిగిన ప్రయోజనాలతో శాఖల వారీగా నివేదిక సిద్ధం చేసుకోవాలని సీఎస్ ఆ ఆదేశాల్లో సూచించారు. ఇంకోవైపు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లోనూ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. సర్పంచి ఎన్నికలతో పాటు ఈ ఏడాది సెప్టెంబరు 24తో గడువు ముగిసే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపరు ముద్రణ, ఓటింగ్ ఇంక్ తదితర ఎన్నికల సామగ్రి కొనుగోలుకు పంచాయతీరాజ్ శాఖలో అధికారుల కమిటీలు ఖరారు చేశారు. ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసు వివాదాలు ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయా కేసులు త్వరితగతిన పరిష్కారానికి మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసుకుంటున్నాయి.
పంచాయతీ పోలింగ్ స్టేషన్ గుర్తింపునకు ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్..
పంచాయతీల వారీగా పోలింగ్ స్టేషన్ల ప్రాథమిక జాబితా తయారీ: 20–08–2026లోగా
ప్రాథమిక పోలింగ్ స్టేషన్ జాబితాల ప్రచురణ తేదీ: 23–08–2026
ప్రాథమిక పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ: 26–08–2026 వరకు
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ల జాబితాకు తుది ఆమోదం: 29–08–2026 లోగా
గ్రామ పంచాయతీల వారీగా పోలింగ్ స్టేషన్ తుది జాబితాలు ప్రచురణ: 31–08–2026


