పొలంలో గుంటక పాస్తున్న రైతుపై తెగిపడిన విద్యుత్ తీగ
షాక్‌కు గురై రైతు దుర్మరణం... ఎద్దు కూడా మృతి
బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళన
గుంతకల్లు రూరల్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిర్వహణ లోపం కారణంగా విద్యుత్ తీగలు దెబ్బతిని పొలంలో గుంటక పాస్తున్న రైతుపై పడటంతో విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందగా, ఎద్దు కూడా మరణించింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... కసాపురం గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, నీలమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తమకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో తనవద్ద ఉన్న ఎద్దులతో ఇతర రైతుల పాలాల్లో వ్యవసాయ పనులకు కూడా ఆంజనేయులు బాడుగలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం భార్య నీలమ్మతో కలిసి కంది పొలంలో గుంటక పాసేందుకు బాడుగకు వెళ్లాడు. గుంటక పాస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ తీగ తెగి ముందు వెళ్తున్న ఒక ఎద్దుపై పడింది. విద్యుదాఘాతానికి గురై ఎద్దు తల్లడిల్లుతుండగా తన వద్ద ఉన్న చెర్నాకోలతో విద్యుత్ తీగను తప్పించేందుకు యత్నించాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన విద్యుత్ తీగ క్షణాల్లో ఆంజనేయులును చుట్టేసింది. ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.
ఆంజనేయులు ఛాతిభాగం, చేతులు కాలిపోయి క్షణాల్లో మృతి చెందాడు. అప్పటికే విద్యుత్‌షాక్‌కు గురైన ఎద్దు కూడా మృతిచెందింది. వెంటనే అప్రమత్తమైన ఇతర కూలీలు వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, గ్రామస్తులు భారీసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో గుంతకల్లు ప్రభుత్వాస్పత్రి ఎదుట బాధిత కుటుంబం, గ్రామస్తులు, రైతులతో కలిసి ధర్నా చేశారు.


