నింగిలోకి నిత్యావసరాల ధరలు | Inflation in the state is increasing month by month | Sakshi
Sakshi News home page

నింగిలోకి నిత్యావసరాల ధరలు

Aug 13 2026 2:22 AM | Updated on Aug 13 2026 2:22 AM

Inflation in the state is increasing month by month

రాష్ట్రంలో నెలనెలా పెరిగిపోతోన్న ద్రవ్యోల్బణం

అత్యధిక ద్రవ్యోల్బణంలో దేశంలోనే ఏపీ రెండో స్థానం.. ఆహార ద్రవ్యోల్బణంలో ఏపీదే మొదటి స్థానం

జూన్‌ నెలను మించి జూలైలో పెరుగుదల

రాష్ట్రంలో జూలైలో సాధారణ ద్రవ్యోల్బణం 5.72%.. పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు అధికం

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడి 

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలతో ప్రజల జీవనం దినదిన గండంగా మారుతోంది. నిత్యావసరాలు.. ప్రధానంగా ఆహార వస్తువులు, కూర­గాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతు­న్నాయి. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ధరల షాక్‌ కొడుతోంది. నానాటికీ ధరలు పెరిగిపోతున్నా చంద్రబాబు సర్కారు కనీస నియంత్రణ చర్యలు చేపట్టడంలేదు. ఓ పక్క రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా, అదే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చేసరికి సామాన్యుడు కొనలేనంతగా ధర పెరిగిపోతోంది. రాష్ట్రంలోని రైతులు, ప్రజలు ఎంతలా దోపిడీకి గురవుతున్నారో ఈ ధరలే తేటతెల్లం చేస్తున్నాయి. 

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అత్యధిక ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్‌ నెలతో పోల్చితే జూలై నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం మరింతగా పెరిగినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది.జూలై నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. 

ఆహార ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్ధానంలో ఉంది. జూలైలో జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో జూన్‌ నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 5.39 శాతం ఉండగా జూలై నెలలో 5.72 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో 8.18 శాతం కాగా, జూలైలో 9.13 శాతానికి పెరిగింది. జూలై నెలలో రాష్ట్రంలో పట్టణాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జూలైలో 6.13 శాతం ద్రవ్యోల్బణం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 5.09 శాతం నమోదైంది. ఇదే నెలలో జాతీయ సగటు సాధారణ ద్రవ్యోల్బణం 4.45 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement